calender_icon.png 13 October, 2025 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం వెలిచాల రాజేందర్ రావు తరపున దరఖాస్తు

13-10-2025 07:12:20 PM

కరీంనగర్ (విజయక్రాంతి): డీసీసీ అధ్యక్ష పదవి ఎన్నిక కోసం ఏఐసీసీ పరిశీలకులు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావుకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతూ సోమవారం మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు డీసీసీ కార్యాలయంలో దరఖాస్తు అందజేశారు. డీసీసీ పిఆర్ఓలు దొంతి గోపి, న్యాత శ్రీనివాస్ కు దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ 1981 నుంచి కాంగ్రెస్ పార్టీలో వెలిచాల రాజేందర్ రావు ప్రస్థానం మొదలైందని పేర్కొన్నారు. 1987లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి యూత్ కాంగ్రెస్ లో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, సంయుక్త కార్యదర్శిగా పనిచేశారని తెలిపారు. అదేవిధంగా రాజేందర్ రావ్ గుండి గోపాలరావుపేట సింగిల్ విండో చైర్మన్ గా, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారని పేర్కొన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టేట్ చాంబర్ ఆఫ్ మార్కెట్ కమిటీ అసోసియేషన్ చైర్మన్ గా, నెడ్ క్యాప్ గా డైరెక్టర్ పనిచేశారని చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రత్యేక కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. 2024లో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా రాజేందర్రావు పోటీ చేశారనీ, ఎన్నికల్లో మూడు లక్షల అరవై వేల ఓట్లు సాధించారని తెలిపారు. అతికొద్ది సమయంలోనే భారీ ఓట్లను సాధించి రికార్డు సృష్టించారని చెప్పారు. కరీంనగర్ ప్రజలకు రాజేందర్ రావు అందుబాటులో ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారనీ, నీతి నిజాయితీగా వ్యవహరిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ సీనియర్ కాంగ్రెస్ నేత జగపతిరావు కరీంనగర్ అభివృద్ధి ప్రదాత అనీ, వారి తనయుడు జగపతిరావు అడుగుజాడల్లో నడుస్తూ తండ్రి ఆశయ సాధనకు కృషి చేస్తూనే, కరీంనగర్ ప్రజలకు అండగా ఉంటున్నారని తెలిపారు.

అదేవిధంగా రాజేందర్ రావు తల్లిదండ్రులు జగపతిరావు సరళాదేవి పేరిట సరల్ జగ్ అనే ట్రస్టును ఏర్పాటుచేసి పేద ప్రజలకు సాయం చేస్తున్నారని పేర్కొన్నారు. నీతిగా నిజాయితీగా సౌమ్యుడిగా వ్యవహరిస్తున్న వెలిచాల రాజేందర్ రావుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. రాజేందర్రావు డీసీసీ అధ్యక్ష పదవికి అన్ని విధాల అర్హుడు అనీ, సమర్థుడని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ విషయాలను అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని డీసీసీ అధ్యక్షుడిగా రాజేందర్ రావును నియమించాలని అధిష్టానాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఆకుల ప్రకాష్, ఆకుల నరసన్న, డీసీసీ ప్రధాన కార్యదర్శి మూల వెంకట రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వేల్పుల వెంకటేష్, గండి రాజేశ్వర్, ఉప్పరి రవి, శ్రావణ్ నాయక్, జువ్వాడి మారుతి రావు, బాషవేణి మల్లేశం పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.