03-12-2024 01:59:00 AM
హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): పెద్దపల్లిలో బుధవారం నిర్వహించనున్న యువ వికాసం సభకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. సభ ఏర్పాట్లపై సంబంధిత అధికారులు, కలెక్టర్లతో సీఎస్ సోమవారం టెలికాన్ఫరెన్స్‌లో సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సభలో 9వేల మందికి సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తారని తెలిపారు. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సభలో ఇటీవల గ్రూప్-4తో పాటు ఎంపికైన సింగరేణిలో ఉద్యోగాలు పొందిన వారికి సీఎం నియామక పత్రాలను అందజేస్తారన్నారు.
ఈ సభలోనే స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యమయ్యే 7 ఏజెన్సీలతో ఒప్పంద పత్రాలపై సంతకం, డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్చేంజ్ ప్రారంభోత్సవంతోపాటు పలు కార్యక్రమాలను ప్రారంభిస్తారని తెలి పారు. వివిధ రంగాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలను తెలియజేసేలా స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సభకు హాజరయ్యే వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.