03-12-2024 02:02:09 AM
నమ్మి వెళ్తే.. నట్టేట ముంచిర్రు!
కామారెడ్డి, డిసెంబర్ 2 (విజయక్రాంతి): బతుకు దెరువు కోసం ఏజెంట్ల మాటలు నమ్మి జోర్డాన్ వెళ్లిన పలువురు యువత అక్కడ నరకయాతన అనుభవిస్తున్నారు. తినడానికి తిండిలేదని, నరకాన్ని అనుభవిస్తున్నామని వాపోతున్నారు. ఏజెంట్ల మాయమాటలు నమ్మి మోసపోయామని బాధితులు సోమవారం ఓ వీడియో షేర్ చేశారు.
మూడు నెలల క్రితం కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి 270 మందిని ఏజెంట్లు కంపెనీ వీసాల పేరుతో జోర్డాన్‌కు పంపించారు. అక్కడికి వెళ్లిన వారం నుంచే తమకు ఇబ్బందులు మొదలయ్యాయని వాపోయారు. కనీసం భోజనం కూడా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
భోజనం గురించి అడిగితే పట్టించుకోవడం లేదని, పనులు మాత్రం చేయించుకుంటున్నారని వాపోయారు. ముంబైలో కామారెడ్డి జిల్లాకు చెందిన ముత్యంపేట రామారావు, ఆంచనూర్‌కు చెందిన సాయిలు, ముత్యంపేట భూమేశ్‌కు ఒకొక్కరం రూ.20 వేల చొప్పున డబ్బు చెల్లించి జోర్డాన్ వచ్చామని తెలిపారు. తీరా జోర్డాన్ వచ్చాక కంపెనీ వీసాలు ఉన్నాయా? అని కంపెనీ వారు అడుగుతున్నారని పేర్కొన్నారు.
ఆదివారం భోజనాల కోసం అడిగితే క్యాబిన్‌లో కరెంట్, నీరు కట్ చేశారని వాపోయారు. పోలీసులను పిలిచి పనికి వెళ్లాల్సిందేనని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 10 గంటలు డ్యూటీ చేయాల్సిందేనని బెదిరిస్తున్నారని వాపోయారు.
సమయం ప్రకారం తాము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, భోజనం అందించాలని వేడుకుంటున్నారు. ఏజెంట్ల మాటలు నమ్మి తాము నరకం అనుభవిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి తమను స్వదేశానికి రప్పించాలని విజ్ఞప్తిచేశారు.