calender_icon.png 13 November, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దూసుకొచ్చిన మృత్యువు

03-12-2024 01:43:42 AM

  1. రోడ్డుపక్కన కూరగాయల వ్యాపారులపై దూసుకెళ్లిన లారీ
  2. నలుగురి మృతి 
  3. ముగ్గురికి తీవ్రగాయాలు
  4. చేవెళ్ల మండలం ఆలూరు స్టేజీ వద్ద ఘటన

చేవెళ్ల, డిసెంబర్ 2: రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించే చిరు వ్యాపారులపైకి లారీ మృత్యువు రూపంలో దూసుకెళ్లింది. కళ్లుమూసి తెరిచేలోపే నలుగురి శరీరాలు నుజ్జునుజ్జవ్వగా.. మరో ముగ్గురి కాళ్లు, చేతులు విరిగిపోయాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చేవెళ్ల మండలం ఆలూరు, నాంచేరు పరిధిలోని ఇంద్రారెడ్డి నగర్‌కు చెందిన 25 మంది రైతులు ఆలూరు స్టేజీ వద్ద బీజాపూర్ హైవే పక్కన కూరగాయలు అమ్ముతుంటారు. ఎప్పటిలాగే సోమవారం కూడా కూరగాయలను తీసుకొచ్చి అమ్ముతుండగా సాయంత్రం 4 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి వికారాబాద్ వైపు వెళ్తున్న లారీ వేగంగా వారిపైకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో ఆలూరుకు చెం దిన నక్కలపల్లి రాములు (40), దామరిగిద్ద కృష్ణ(22), ఇంద్రారెడ్డి నగర్‌కు చెందిన ఎస్ సుజాత(42) అక్కడికక్కడే చనిపోయారు. అలాగే సెంట్రింగ్ పనిమీద వచ్చి టీ తాగేందుకు ఆలూరు వద్ద ఆగిన టోలిచౌకికి చెందిన జమీల్(26) కూడా స్పాట్‌లోనే చనిపోయాడు.

ఆలూరుకు చెందిన సామల బాలమణి, ఇంద్రారెడ్డి నగర్‌కు చెందిన పద్మమ్మ, ఆంధ్రప్రదేశ్‌కు  చెందిన మాల్యాద్రి (ఇతను జామతోటలో వాచ్‌మెన్.. స్టేజీ వద్ద జామకాయలు అమ్ముతాడు)కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు.. మృతదేహాలను,  క్షతగాత్రులను వెంటనే చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ చంద్రాయణగుట్టకు చెందిన అమీర్.. క్యాబిన్‌లో ఇరుక్కోవడంతో అతని రెండుకాళ్లు విరిగిపోయాయి. అతికష్టం మీద జేసీబీ సాయంతో అతడిని బయటికి తీసి.. ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

లారీ బీభత్సాన్ని అడ్డుకున్న వృక్షం..

లారీ బీభత్సానికి ఆలూరు స్టేజి వద్ద ఉన్న ఓ భారీ వృక్షం అడ్డుకట్ట వేసి మరింత ప్రాణనష్టాన్ని తగ్గించింది.. ముగ్గురి పైనుంచి దూసుకెళ్లిన తర్వాత ఆ లారీ మర్రిచెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. లేదంటే మరో 20 మంది దాకా ప్రాణాలు పోయేవని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. క్షణాల్లో ఘోరం జరిగిపోయిందని, చూస్తుండగా.. నలుగురు చనిపోయారని వాళ్లు వాపోయారు.

రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, చేవెళ్ల ఏసీపీ కిషన్, ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రోడ్డు ప్రమాదం కారణంగా ట్రాఫిక్ జామ్ కావడంతో హైదరాబాద్, చేవెళ్ల వెళ్లే వాహనాలను దారిమళ్లించారు. వికారాబాద్ నుంచి వచ్చే వాహనాలను సిద్దులూర్ మీదుగా, పరిగి నుంచి వచ్చే వాహనాలను చిట్టెంపల్లి, అంతారం మీదుగా హైదరాబాద్ పంపించారు.

హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు శంకర్‌పల్లి, చిల్కూరు, ముడిమ్యాల మీదుగా మళ్లించారు. తదనంతరం రెండు క్రేన్లు రెండు జేసీబీలతో 5 గంటలు కష్టపడి లారీని పక్కకు జరిపి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఆర్డీవో చంద్రకళ, తహసీల్దార్ కిష్టయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి.. కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు.  

ప్రభుత్వం ఆదుకోవాలి: సబితా ఇంద్రారెడ్డి

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన చిరువ్యాపారుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి డిమాండ్ చేశారు. చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో మృతుల కుటుంబ సభ్యులను, గాయపడి చికిత్స పొందుతున్న వారిని సబితారెడ్డి పరామర్శించారు.

ఆమె మాట్లాడుతూ.. బీజాపూర్ హైవేపై నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగి ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని..  వెంటనే అప్పాజంక్షన్ నుంచి మన్నెగూడ వరకు హైవే పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రత్నం కూడా బాధిత కుటుంబాలను పరామర్శించారు. 

బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: పట్నం

మృతుల కుంటుంబాలను అన్నివిధాల ఆదుకుంటామని మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం రాత్రి ఎమ్మెల్యే కాలె యాదయ్య, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి పామెన భీమ్ భరత్‌తో కలిసి చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో మృతుల కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.