03-05-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి టౌన్, మే 2 : కొత్తగా ఏర్పాటు చేసే లే అవుట్ లలో ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని నిబంధనలు పాటిస్తేనే కమిటీ ద్వారా ఆమోదం పొందుతుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన లే అవుట్ కమిటీ సమావేశం నిర్వహించారు.
జిల్లాలో వివిధ మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన లే అవుట్ లను దస్తావేజులు, గూగుల్ ఎర్త్ మ్యాపింగ్ ద్వారా పరిశీలించి అన్ని అర్హతలు ఉన్న లే అవుట్ లను ఆమోదించారు. ఇరిగేషన్ కెనాల్, ముంపు, నాలా సమస్యలు లేకుండా నిబంధనల ప్రకారం రోడ్లు, ఖాళీ స్థలం, పార్కింగ్ ఉన్న లే అవుట్ లను మాత్రమే కమిటీ ద్వారా ఆమోదించడం జరుగుతుందన్నారు.
రోడ్లు, 10 శాతం ఖాళీ స్థలం ప్రభుత్వం పేరున రిజిస్టర్ చేయాల్సి ఉంటుందని, అదేవిధంగా రోడ్లు, డ్రైన్, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఒక్కో లే అవుట్ ను గూగుల్ మ్యాప్ ద్వారా క్షుణ్ణంగా పరిశీలించి ఇరిగేషన్, మున్సిపల్ అధికారి, రోడ్లు భవనాల ఇంజనీరు, టౌన్ ప్లానింగ్ అధికారుల అభిప్రాయం, అభ్యంతరాలు తెలుసుకొని కమిటి ఆమోదించడం లేదా తిరస్కరించడం జరిగింది.
ఈ రోజు కమిటీ ముందు మొత్తం ( 6) లే అవుట్ లు పరిశీలనకు రాగా ఇందులో నిబంధనల ప్రకారం అన్ని సరిగ్గా ఉన్న (4) లే అవుట్ లు ఆమోదించడం జరిగింది. మిగిలిన (2) పెండింగ్ లో పెట్టినట్టు కలెక్టర్ తెలిపారు.
నిబంధనలు పూర్తి చేయగానే పెండింగ్ లో ఉన్న వాటిని సైతం కమిటీ ద్వారా ఆమోదించనున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య, ఇరిగేషన్ ఇంజనీర్లు, డి. ఈ ఆర్ అండ్ బి, మున్సిపల్ కమిషనర్లు, టి. పి. ఒ లు, లే అవుట్ యజమానులు, ప్లానర్ లు తదితరులు పాల్గొన్నారు.