06-08-2025 12:06:03 AM
హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): రాష్ట్రంలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది. ఇందుకు బీఆర్‌ఎస్ పార్టీనే కమలనాథులు టార్గెట్‌గా ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్‌ఎస్ పార్టీని వీడారు. ఆయన త్వరలో బీజేపీలో చేరబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు ఈనెల రెండోవారంలో ముహూర్తం పెట్టినట్లుగానూ చెబుతున్నారు.
మరోవైపు ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం సైతం అదేబాటలో ఉన్నట్లుగా పాలమూరు రాజకీయాల్లో చర్చ కొనసాగుతోంది. వీరితో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు సుమారు 10 మంది వరకు బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారని రాజకీయ వర్గాల్లో విస్తృతమైన ప్రచారం నడుస్తోంది. గతంలో ఆపరేషన్ ఫాంహౌస్‌లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా చేరే వారి జాబితాలో ఉన్నట్లుగా గుసగుసలు వినపడుతున్నాయి.
అయితే ఇప్పటికే నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తాను బీఆర్‌ఎస్ పార్టీ వీడబోనని ప్రకటించారు. తాము పార్టీ వీడే ప్రసక్తే లేదని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ‘విజయక్రాంతి’కి తెలిపారు. ఇప్పుడు తాను బీఆర్‌ఎస్ పార్టీలో చాలా కంఫర్ట్‌గా ఉన్నట్లు తెలిపిన ఆయన.. నియోజకవర్గంలో ప్రజలను కలు స్తూ రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు.
పార్టీ మారే అంశంపై చర్చ
అయితే నిప్పు లేనిదే పొగ రాదన్నట్లుగా బీఆర్‌ఎస్ మాజీలు పార్టీ మారే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే పలువురు మాజీలు ఎంపీ ఎన్నికల సమయం నుంచే బీజేపీలోకి చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం కొందరు ఢిల్లీ కూడా వెళ్లివచ్చారని.. అయితే సరైన సమయం చూసి తామే ఆహ్వానిస్తామని బీజేపీ ముఖ్య నేత ఒకరు అప్పట్లో హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు బీఆర్‌ఎస్ పార్టీలో ఇక ముందుకు పోయే పరిస్థితి లేదని భావించే మాజీలు బీజేపీ వైపు చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆపరేషన్ ఫాంహౌస్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటి కే మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీ బాట పట్టేందుకు సిద్ధప డుతుండగా... మిగతా ముగ్గురు అదే లైన్‌లో ఉన్నారని చర్చించుకుంటున్నారు.
గతంలో ఫాంహౌస్ ఘటనలో తాము బీఎల్ సంతోశ్ పేరును చెప్పలేదని, అప్పుడు బీఆర్‌ఎస్ పెద్దల ఒత్తిడితోనే ఆయన పేరు చెప్పినట్లుగా వారు సంతోశ్‌కు వివరించినట్లుగా రాజకీయ వర్గా ల్లో చర్చ జరుగుతోంది. బీఆర్‌ఎస్ పార్టీ పెద్దలకు తెలిసే ఈ చేరికల తంతు జరుగు తోందని కూడా మరో టాక్ నడుస్తోంది. కాగా... బీజేపీలో చేరికపై మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో ‘విజయక్రాంతి’ మా ట్లాడగా..తాను బీఆర్‌ఎస్ పార్టీని వీడానని, అయితే తాను ఏ పార్టీలో చేరేది బుధవారం తన వెంట ఉండే నేతలు, కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత చెప్తానని పేర్కొన్నారు. అయితే బీజేపీలో చేరికపై ఆయన ఇంకా స్పష్టత ఇవ్వకపోయినా దారులు అటే చూపిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.