07-08-2025 11:54:55 AM
బీసీ రిజర్వేషన్ల కోసం తుది వరకు పోరాడుతాం: మంత్రి పొన్నం
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల పెంపు అమలు కోసం ఢిల్లీలో మూడో రోజు కాంగ్రెస్ మహాధర్నా పోరు కొనసాగుతోంది. బిల్లులు ఆమోదం కోరుతూ ఇవాళ రాష్ట్రపతిని కలవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇప్పటివరకు కాంగ్రెస్ నేతలకు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ లభించలేదు. బీసీ రిజర్వేషన్ల కోసం తుదివరకు పోరాడుతామని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) స్పష్టం చేశారు. గాంధేయపద్దతిలో పోరాటం అనుకున్నది సాధిస్తామని తెలిపారు. కిషన్ రెడ్డి లాంటి వారి కుట్రలను సాగనివ్వమని మంత్రి పొన్నం తేల్చిచెప్పారు.
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ(Bharatiya Janata Party) చావుతప్పి కన్నలొట్ట.. అన్నట్లుగా గెలిచిందని పొన్నం విమర్శించారు. ఉత్తరాదిలో చాలా రాష్ట్రాల్లో బీసీలు బీజేపీని తిరస్కరించారని పొన్నం వివరించారు. బీసీ రిజర్వేషన్ల పెంచకుంటే వచ్చే ఎన్నికల్లో బీజీపీ ఓటమి ఖాయమని పొన్నం హెచ్చరించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ(Congress Party) ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు నాయకులకు మంత్రి పొన్నం ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక నినాదాలు తీసుకొని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రభావితం చేయడానికి ఇంత దూరం వచ్చి జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం చేస్తున్నామంటే మన అకుంఠిత దీక్ష పట్టుదల మన ఆలోచన విధానం రాహుల్ గాంధీ నాయకత్వంలో రిజర్వేషన్లు సాధించడానికి కార్యచరణ తీసుకొని ముందుకు పోతున్నామని తెలిపారు.