18 March, 2026 | 4:33 AM

నిందితులకు కొమ్ముకాస్తున్నారా?

18-03-2026 01:27 AM
  1. పెచ్చుమీరుతున్న రాజకీయ దాడులు
  2. చండూరు హత్యాయత్నం కేసులో బలహీనమైన సెక్షన్‌లా?
  3. పరిగిలో బాధితులపైనే ఎదురు కేసులు!
  4. కాంగ్రెస్ కనుసన్నల్లో పోలీసులు.. 
  5. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు 
  6. అధికారులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, పోలీసు వ్యవస్థ అధికార కాంగ్రెస్ పార్టీకి అనుబంధ విభాగంలా మారుతోందని బీజేపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ శ్రేణులపై జరుగుతున్న వరుస దాడులు, పోలీసుల పక్షపాత వైఖరిని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మంగళవారం డీజీపీని కలిసింది.

పలు జిల్లాల్లో బీజేపీ నాయకులను టార్గెట్ చేస్తూ జరుగుతున్న భౌతిక దాడులు, ఆపై పోలీసులు నిందితులకు వత్తాసు పలుకుతున్న తీరును వివరిస్తూ డీజీపీకి వినతిపత్రాన్ని సమర్పించారు. నల్లగొండ జిల్లా చండూరులో బీజేపీ నాయకులపై జరిగిన దాడిని రాంచందర్‌రావు ఈ సంద ర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది ముమ్మాటికీ పథకం ప్రకారం జరిగిన హత్యాయత్నమని, ఈ దాడిలో కార్యకర్తలు ప్రాణా పాయ స్థితిలో ఉన్నా.. పోలీసులు మాత్రం నిందితులకు ప్రయోజనం చేకూర్చేలా అత్యంత బలహీనమైన సెక్షన్లతో కేసు నమో దు చేశారని మండిపడ్డారు.

నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, కఠిన సెక్షన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు బరితెగించి బీజేపీ కార్యకర్తలపై దాడులకు దిగినా, స్థానిక పోలీసులు నిమ్మ కు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి గురైన బీజేపీ కార్యకర్తలకు న్యాయం చేయాల్సింది పోయి, వారిపైనే ఎదురు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఇది పోలీసుల పక్షపాతానికి పరా కాష్ట అని ధ్వజమెత్తారు. పోలీసు యంత్రాం గం ఖాకీ దుస్తులు తీసి కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు.

ము న్సిపల్ ఎన్నికల ప్రచార సమయంలో నల్లగొండ జిల్లాలో చోటుచేసుకున్న పరిణా మాలను బీజేపీ బృందం డీజీపీ దృష్టికి తీసుకెళ్లింది. బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడి పట్ల స్థానిక డీఎస్పీ అత్యంత అనాగరికంగా, అమర్యాదగా వ్యవహరించారని.. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రతిపక్ష పార్టీ నేతలతో ఇలా ప్రవర్తించడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు.

అహంకారంతో వ్యవహరిస్తున్న సదరు అధికారులపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి బీజేపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న అధికారుల చిట్టా తమ వద్ద ఉందని, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని బీజేపీ నాయకులు హెచ్చరించారు. బాధితులకు న్యాయం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని డీజీపీకి స్పష్టం చేశారు. ఈ ప్రతినిధుల బృందంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయశ్రీ, కళ్యాణ్ నాయక్, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్, సీనియర్ నాయకులు మారుతీ కిరణ్, రామకృష్ణ ,సీనియర్ న్యాయవాది ఆంథోనీరెడ్డి ఉన్నారు.