28-01-2026 09:38:03 PM
హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): అగ్రంపహాడ్ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి అధికారులను ఆదేశించారు. బుధవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతున్న నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి నాగేశ్వరరావు, పరకాల ఆర్డీవో డాక్టర్ కన్నం నారాయణ, ఇతర అధికారులతో కలిసి జాతరలో ఏర్పాట్లు, నిర్వహణ అంశాల గురించి అదనపు కలెక్టర్ వారిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రవి మాట్లాడుతూ అగ్రం పహాడ్ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా అమ్మవార్లను దర్శించుకునే భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణ ఎప్పటికప్పుడు చేపట్టాలన్నారు. తాగునీటి సరఫరా బాగుండాలని ఎంపీడీవో కు సూచించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.