మియాపూర్ భూముల రక్షణకు ఏర్పాట్లు
పనులకు రూ.3.5 కోట్ల నిధులు కేటాయింపు
ఎనిమిది కిలోమీటర్ల మేర ఫెన్సింగ్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 25 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో మియాపూర్ భూముల పరిరక్షణకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) అధికారులు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఆ భూములను అక్రమించుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని తెలుసుకుని అప్రమత్తమవుతున్నారు. ఆ ప్రాంతంలో సర్వే నంబర్లు 100, 101లో సుమారు 455 ఎకరాల భూమి హెచ్‌ఎండీఏకే చెందుతుందని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో హెచ్‌ఎండీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది భూములపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు.
దీనిపై కొందరు వ్యక్తులు సుప్రీం కోర్టులో సైతం పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. సదరు భూమి చుట్టూ రూ.3.5 కోట్ల నిధులతో సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే హఫీజ్‌పేట సమీపంలోని సర్వే నంబర్ 159లో 67 ఎకరాలు, మియాపూర్ చౌరస్తా సమీపంలోని సర్వే నంబర్ 28లో 131 ఎకరాలు, బస్ బాడీస్ తయారీ కేంద్రం వద్ద సర్వే నంబరు 20/1లో 244 ఎకరాలూ హెచ్‌ఎండీఏకి చెందినవే. వాటిని రక్షించేందుకు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. మియాపూర్ భూముల వ్యవహారం మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.






