గణతంత్ర దినోత్సవాలకు సకాలంలో ఏర్పాట్లు
అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి
మేడ్చల్, జనవరి 9 (విజయ క్రాంతి):మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ విసి హాల్ లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలకు కలెక్టరేట్ ప్రాంగణంలో రంగురంగు పూలతో స్టేజిని అందంగా ముస్తాబు చేయాలని జిల్లా ఉద్యానశాఖ, విద్యాశాఖ వారు విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, ప్రజల కోసం వేడుకలను తిలకించేందుకు వీలుగా ఉండేలా షామియానాలు (టెంట్లు), కుర్చీలు, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి శాఖ అధికారులు ఈ విషయంలో పూర్తి బాధ్యత తీసుకొని ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.
జాతీయ జెండా ఆవిష్కరణ, గౌరవ వందనం, ప్రసంగానికి సమాచారశాఖ వారు మైకు పిఎ సిస్టం అమర్చాలన్నారు. వేడుకలు ముగిసేంత వరకు నిరంతరాయంగా విద్యుత్తు ఉండేలా చూడాలని విద్యుత్తు శాఖ వారిని ఆదేశించారు. కలెక్టరేట్ ప్రాంగణం మొత్తం పరిశుభ్రంగా ఉండేలా మున్సిపల్ కమీషనర్ చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టరేట్ లోని గణతంత్ర వేడుకలు నిర్వహించేందుకు కలెక్టరేట్ ప్రాంగణాన్ని సంబంధిత అధికారులతో కలిసి అదనపు కలెక్టర్ విజయరేందర్ రెడ్డి పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ హరిప్రియ, డిఆర్డిఓ సాంబశివరావు, సిపిఓ శేఖర్, ఉద్యాన శాఖాధికారి శ్రీధర్, ఎస్సి, బిసి సంక్షేమ శాఖల అధికారులు వినోద్ కుమార్, ఝాన్సీరాణి, సివిల్ సప్లై డిఎం సుగుణ బాయి, సివిల్ సప్లై జిల్లా అధికారి శ్రీనివాస్ రెడ్డి, పోలీస్, ఫైర్ శాఖల అధికారులు, తహాసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.




