03-05-2025 01:28:16 AM
హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
హనుమకొండ, మే 2 (విజయ క్రాంతి) : ఈ నెల 4వ తేదీన(ఆదివారం)నీట్ పరీక్ష జరగనుందని, పరీక్ష కేంద్రంలోనికి అభ్యర్థులను ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు అనుమతిస్తారని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నీట్ పరీక్షకు సంబంధించి పరీక్ష రాసే అభ్యర్థులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.
నీట్ పరీక్ష నిర్వహణకు హనుమకొండ జిల్లా పరిధిలో 10 పరీక్షా కేంద్రాలు, వరంగల్ పరిధిలో 1పరీక్షా కేంద్రాన్ని కేటాయించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలలోనికి అభ్యర్థులు ప్రవేశించేందుకు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1:30 నిమిషాల వరకు అనుమతిస్తారని పేర్కొన్నారు. నియమిత సమయం దాటిన తర్వాత విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రంలోనికి అనుమతి లేనందున అభ్యర్థులు సకాలంలో చేరుకోవాలని కోరారు.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష గదికి వెళ్లే ముందు బయోమెట్రిక్ అటెండెన్స్, రిజిస్ట్రేషన్, తనిఖీ ప్రక్రియ ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం1:30 లోగానే చేరుకోవాలన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డులో ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మరొక పోస్ట్ కార్డు సైజు ఫోటోను అడ్మిట్ కార్డుకు అతికించాలని అన్నారు. అదనంగా మరొక పాస్పోర్ట్ సైజ్ ఫోటోను వెంట తెచ్చుకోవాలన్నారు. అప్డేటెడ్ ఆధార్ కార్డును తీసుకురావాలన్నారు.
లేటెస్ట్ ఫోటోతో కూడిన ఐడి ప్రూఫ్ ను అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి తీసుకురావాలన్నారు. దివ్యాంగులు ధ్రువీకరించిన సర్టిఫికెట్లను తీసుకురావాలన్నారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు పెన్నులు, పెన్సిళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురావద్దని సూచించారు. పరీక్షా కేంద్రంలోని అభ్యర్థులకు పెన్నులను అందజేయడం జరుగుతుందన్నారు.
పరీక్ష కేంద్రాలకు ఎలక్ట్రానిక్ పరికరాలైన మొబైల్ ఫోన్లు, డిజిటల్ చేతి గడియారాలు, బ్లూటూత్ వంటివి అనుమతించబడవని పేర్కొన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నీట్ పరీక్షను సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లను పూర్తిచేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య వెల్లడించారు.