07-05-2025 01:08:31 AM
హైదరాబాద్, మే 6 : ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 15ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఈ కేసులో ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈకేసులో ప్రధాన నిందితులైన గాలి జనార్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివాస్‌రెడ్డి, మెఫజ్ అలీఖాన్, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వీడీ రాజగోపాల్‌ను దోషులుగా నిర్ధారిస్తూ శిక్షలు ఖరారు చేసింది.
ఈ కేసులో అప్పటి గనులశాఖ మంత్రిగా ఉన్న సబితాఇంద్రారెడ్డిని నిర్దోషిగా ప్రకటించింది. ఆమెతో పాటు అప్పటి పరిశ్ర మల శాఖ కార్యదర్శి కృపానందంను సైతం నిర్దోషిగా తేల్చింది. ఐదుగురు దో షులకు రూ.10వేల చొప్పున జరిమానా, ఈ కేసులో దోషిగా తేలిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి రూ.2లక్షల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో ఏడాది జైలుశిక్ష అనుభవించాల్సి వస్తుందని స్పష్టం చేసింది.
కాగా, వీడీ రాజగోపాల్‌కు అదనంగా మరో నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. భూగర్భ గనుల శాఖ డైరెక్టర్‌గా ఉన్నందున అవినీతి నిరోధక చట్టం కింద ఆయనకు అదనపు శిక్ష ఖరారు చేసింది. ప్రభుత్వ అధికారిగా ఉంటూ అక్రమాలకు పాల్పడినందున మొత్తంగా 11 ఏళ్ల శిక్షను ఆయన అనుభవించాల్సి ఉంటుంది.
ఓబుళాపురం మైనింగ్ కేసు ఇదీ..
ఓబుళాపురం అక్రమ మైనింగ్‌పై డిసెంబర్ 7, 2009న సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. 2011లో మొదటి చార్జ్‌షీట్ దాఖలు చేశారు. దీనిలో ఏ1, ఏ2లుగా ఉన్న గాలి జనార్దన్‌రెడ్డి, ఆయన సోదరుడు శ్రీనివాస్‌రెడ్డి కలిసి అక్రమంగా ఓబుళాపురం గనులను తవ్వి వాటిని ఎగుమతి చేస్తున్నారని పేర్కొన్నారు.
దీని ద్వారా దాదాపు రూ.844 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని ఆ చార్జ్‌షీట్‌లో పొందుపర్చారు. ఈకేసులో దాదాపు 219 మంది సాక్షులను న్యాయస్థానం ముందు ఉంచి వారి వాంగ్మూళాన్ని రికార్డు చేశారు. ఓఎంసీ కేసులో 2009 నుంచి 2014 వరకు సీబీఐ మొత్తం నాలుగు చార్జ్‌షీట్‌లను దాఖలు చేసింది.
అనంతపురంలోని ఓబుళాపురంలో గనుల కేటాయింపు, తవ్వకాలకు సంబంధించి అత్యాధునిక పరికరాలతో సీబీఐ ఆధారాలు సేకరించింది. అక్రమంగా తవ్వకాలు, రవాణా, ఎగుమతులు, విక్రయాల్లో భారీగా అవకతవకలు జరిగినట్టు సీబీఐ గుర్తించింది. ఏపీ, కర్ణాటక సరిహద్దుల్లో పెద్దఎత్తున తవ్వకాలు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు.
దీనిపై పూర్తి ఆధారాలు, సాక్ష్యాల సేకరణతో 2014లో తుది చార్జ్‌షీట్ దాఖలైంది. విదేశాలకు అక్రమంగా దాదాపు 60 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేశారని, అక్రమ బినామీ లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఈకేసు విచారణలో మొత్తం 3,337 డాక్యుమెంట్లను పరిశీలించారు.
అరెస్ట్ కానిది సబిత ఒక్కరే..
ఓఎంసీ కేసులో అప్పటి ప్రభుత్వంలో గనులశాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి మాత్రమే ఇప్పటివరకు ఈ కేసులో అరెస్ట్ కాలేదు. కేసులో మిగిలిన నిందితులంతా అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. ఈ కేసులో సబిత డిశ్చార్జ్ పిటిషన్ వేసినప్పటికీ కూడా..ఆమె పాత్ర కీలకమని గతంలో డిశ్చా ర్జ్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
అయితే ఈ కేసులో సబిత ఇంద్రారెడ్డి, కృపానందం పాత్ర లేదని, వారికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేనందున వారిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కాగా, ఈ కేసులో ఏ5గా ఉన్న లింగారెడ్డి కేసు విచారణ దశలో ఉండగానే మృతిచెందారు. ఏ6 సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మిని 2022లో ఈ కేసు నుంచి తెలంగాణ హైకోర్టు డిశ్చార్జి చేసింది.
ఓబుళాపురం మైనింగ్ కేసులో నిందితులు వీళ్లే..
ఏ1 - బీవీ శ్రీనివాస్‌రెడ్డి
ఏ2 - గాలి జనార్దన్‌రెడ్డి
ఏ3 - వీడీ రాజగోపాల్
ఏ4 - ఓఎంసీ కంపెనీ
ఏ5 - లింగారెడ్డి(విచారణదశలో మరణం)
ఏ6 - ఐఏఎస్ శ్రీలక్ష్మి (2022లో ఈ కేసు నుంచి డిశ్చార్జి)
ఏ7 - మెఫజ్ అలీఖాన్
ఏ8 - కృపానందం(నిర్దోషి)
ఏ9 - సబితా ఇంద్రారెడ్డి(నిర్దోషి)
న్యాయస్థానంపై నమ్మకం ఉంచా
ఓఎంసీ కేసులో పన్నెండున్నరేళ్ల క్రితం కన్నీళ్లతో కోర్టు మెట్లు ఎక్కాను. ఏ తప్పూ చేయకపోయినా ఈ కేసులో నన్ను చేర్చడంపై ఎంతో బాధపడ్డాను. న్యాయవ్యవస్థ ద్వారా తనకు న్యాయం జరుగుతుందని నమ్మా. ఈ రోజు అదే జరిగింది.
ఇన్నేళ్లుగా నేను పడిన అవమానాలు, ప్రతిపక్షంలో ఉన్నవారు నన్ను అవినీతిపరురాలిగా, జైలుకు పోతానని మాటలు అంటుంటే ఎంతో బాధపడ్డాను. ఎంతగా ప్రచారం చేసినా నా జిల్లా ప్రజలు, నియోజకవర్గ ప్రజలు నాపై సంపూర్ణంగా విశ్వాసం ఉంచి, నన్ను గెలిపిస్తూ వచ్చారు. ఇన్నేళ్లుగా నాతో ఉండి ధైర్యం చెప్పిన అందరికీ కృతజ్ఞతలు.
మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి