07-05-2025 01:13:05 AM
పాక్ సరిహద్దుల్లో నేడు రేపు యుద్ధ విమానాల గర్జన
న్యూఢిల్లీ, మే 6: వైమానిక దాడులు జరిగితే ఎలా స్పందించాలనే దానిపై బుధవారం దేశవ్యాప్తంగా పౌరులకు మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. కేంద్ర హోంశాఖ సూచనల మేరకు రాష్ట్రాలు ఈ డ్రిల్స్ జరపనున్నాయి. చివరిసారిగా 1971 యుద్ధ సమయంలో దేశంలోని పౌరులకు ఇటువంటి డ్రిల్స్ నిర్వహించారు. అప్పుడు కేవలం సరిహద్దు రాష్ట్రాల్లోనే డ్రిల్స్ నిర్వహించిన హోం మంత్రిత్వ శాఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
244 సివిల్ డిఫెన్స్ జిల్లాల్లోని 259 ప్రాంతాల్లో డ్రిల్స్ నిర్వహించ నున్నారు. ఒక వేళ శత్రుదేశం దాడులు నిర్వహిస్తే తమను తాము ఎలా రక్షించుకోవాలనే విషయంపై బలగాలు పౌరుల కు దిశానిర్దేశం చేయనున్నాయి. ఈ డ్రిల్స్ సమ యంలో నగదు, మెడికల్ కిట్లు, టార్చ్‌లైట్లు దగ్గర ఉంచుకోవాలని పౌరులకు సూచించారు.
మంగళవారం కేంద్ర హోంశాఖ సెక్రటరీ గోవింద్ మోహన్ అధ్యక్షతన రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో సమీక్ష నిర్వహించారు. ఈ డ్రిల్ యుద్ధానికి సంకేతం కాదని, పౌరుల అవగాహన కోసం మాత్రమేనని అధికారులు పేర్కొన్నారు. మరోపక్క బుధ, గురువారాల్లో పాకిస్థాన్ సరిహద్దుల్లో భారీస్థాయిలో విన్యాసాలు నిర్వహించేందుకు భారతీయ వాయుసేన సమాయత్తమైంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.
1971లో చివరిసారిగా..
భారత్ గతంలో కూడా ఇలాంటి తరహా మాక్ డ్రిల్స్ నిర్వహించింది. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కొరకు పాక్‌తో యుద్ధం సందర్భంగా ఇటువంటి డ్రిల్స్‌నే నిర్వహించారు. ఆనాడు తూర్పుపాకిస్థాన్‌గా ఉన్న ప్రస్తుత బంగ్లాదేశ్‌కు సాయం చేసేందుకు భారత్ యుద్ధంలో పాల్గొంది. 1962, 1965 యుద్ధాల సమయాల్లో కూడా పౌరులను అప్రమత్తం చేసేందుకు ఇదే విధంగా డ్రిల్స్ చేపట్టారు. మళ్లీ 54 ఏండ్ల తర్వాత ఇప్పుడు చేపడుతున్నారు. అప్పట్లో ఇందిరాగాంధీ నాయకత్వంలో ఈ డ్రిల్స్ నిర్వహించారు.
259 ప్రాంతాల్లో డ్రిల్స్
మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, అస్సాం, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్, గోవాతో దేశవ్యాప్తంగా ఉన్న ౨౪౪ జిల్లాల్లోని 259 చోట్ల ఈ డ్రిల్స్ నిర్వహించనున్నట్టు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్‌కు సరిహద్దుగా ఉన్న రాజస్థాన్, పంజాబ్, జమ్మూకశ్మీర్‌తో పాటు పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో ఈ డ్రిల్స్ నిర్వహించనున్నారు. విపత్తు సమయంలో ఎలా వ్యవహరించాలో ఈ డ్రిల్స్ ద్వారా వివరించనున్నారు.
డ్రిల్స్ నిర్వహించే ప్రాంతాలను మూడు క్యాటగిరీలుగా విభజించారు. క్యాటగిరీ-1లో 13 ప్రాంతాలు, 2వ క్యాటగిరీలో 201 ప్రాంతాలు, 3వ కేటగిరీలో 45 ప్రాంతాలను చేర్చారు. ప్రధాని నివాసంతో పాటు త్రివిద దళాల ప్రధాన కార్యాలయాలు ఉన్న ఢిల్లీని క్యాటగిరీ 1లో చేర్చారు. యుద్ధం కోసం కాకుండా పాకిస్థాన్ ఆత్మస్థుర్యైన్ని దెబ్బతీసేందుకే అని అధికారులు తెలిపారు.
అసలెందుకీ డ్రిల్స్
ఉద్రిక్తతలు నెలకొన్నపుడు, యుద్ధాలు జరిగినపుడు సామాన్య పౌరుల కోసం ప్రభుత్వాలు ఇటువంటి మాక్ డ్రిల్స్ చేపట్టడం సర్వసాధారణం. ఈ మాక్ డ్రిల్స్ వల్ల ఉపయోగాలు..
* ఒక వేళ వైమానిక దాడులు జరిగితే ఎలా స్పందించాలో తెలుసుకునేందుకు..
* గగనతల దాడుల హెచ్చరిక వ్యవస్థల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు..
* వైమానిక దాడులు జరిగినపుడు మోగే సైరన్‌ల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు..
* కంట్రోల్ రూంలు, షాడో కంట్రోల్ రూంల పనితీరును పర్యవేక్షించేందుకు.
Fదాడుల సమయంలో తమను తాము ఎలా కాపాడుకోవాలో పౌరులు, విద్యార్థులు ఇతరులకు వివరించేందుకు..
* సివిల్ డిఫెన్స్ సర్వీసులు, వార్డెన్ సర్వీసులు, అగ్నిమాపక కేంద్రాల పనితీరు, రెస్క్యూ ఆపరేషన్ల పనితీరును తెలుసుకునేందుకు..
* తరలింపు ప్రణాళికల సంసిద్ధను తెలుసుకోవడం ఈ డ్రిల్స్ ద్వారా సాధ్యపడుతుంది.
డ్రిల్స్ సమయంలో ఏం జరగనుంది?
మాక్ డ్రిల్స్ నిర్వహించే సమయంలో వైమానిక దాడులు జరిగినపుడు ఎలా సైరన్లు మోగుతాయో అలాగే సైరన్లు మోగనున్నాయి. ఆ సమయంలో పౌరులు ఎలా ప్రతిస్పందిస్తారో చూడనున్నారు. కాపాడుకునేందుకు ఏం చేయాలో కూడా వివరించనున్నారు. డ్రిల్స్ నిర్వహించే ప్రాంతాల్లో బలగాలు సాధారణ పౌరులకు దాడులు జరిపితే ఎలా తప్పించుకోవాలో వివరించనున్నారు.
మొదలైన రిహార్సల్స్..
ఈ మాక్ డ్రిల్స్ కోసం మంగళవారం చాలా ప్రాంతాల్లో రిహార్సల్స్ జరిగాయి. యుద్ధం వస్తే ఎలా వ్యవహరించాలనే దానిపై అవగాహన కల్పిస్తున్నారు. మంటలు వ్యాపిస్తే ఎలా అదుపు చేయాలి, గాయపడిన వారిని ఎలా తరలించాలి, ఎటువంటి ప్రాథమిక చికిత్స అందించాలనే దానిపై రిహార్సల్స్ చేపట్టారు. మంగళవారం ఈ డ్రిల్స్ గురించి జమ్మూకశ్మీర్ పాఠశాలల్లోని విద్యార్థులకు తర్పీదునిచ్చారు. లక్నోలో కూడా డ్రిల్స్‌పై అవగాహన కల్పించారు.
సరిహద్దుల్లో వాయుసేన విన్యాసాలు
పాకిస్థాన్ సరిహద్దు వెంబడి భారతీయ వాయుసేన వైమానిక విన్యాసాలు చేపట్టనుంది. ఇందుకు సంబంధించి మంగళ వా రం భారత ప్రభుత్వం వాయుసేనకు నోటీస్ టూ ఎయిర్‌మెన్ (నోటమ్) జారీ చేసింది. బుధ, గురు వారాల్లో ఈ విన్యాసాలు నిర్వహించనున్నారు. ఈ విన్యానాల్లో రఫేల్, మి రేజ్ 2000, సుఖోయ్-30 యుద్ధ విమానాలు పాల్గొననున్నాయి.
వాయుసేన ఉన్న తాధికారులు విన్యాసాలను పర్యవేక్షించనున్నారు. నోటమ్‌లో పేర్కొన్న విధంగా విన్యా సాలు చేస్తున్న ప్రాంతాల్లో గగనతల వాడకాన్ని తగ్గించాలి. ఇప్పటికే భారత్ ‘ఆక్రమణ్’ పేరుతో భారీ స్థాయి సైనిక విన్యాసాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్‌లో 4.15 గంటల నుంచి
నేడు నిర్వహించే సివిల్ మాక్ డ్రిల్స్‌ను ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరుతో హైదరాబాద్‌లో సాయంత్రం 4 గం టల నుంచి 4.30 వరకు నిర్వహించనున్నారు. ఓఆర్‌ఆర్ పరిధిలోని సికిం ద్రాబాద్ కంటోన్మెంట్, కంచన్ బాగ్, మౌలాలి ఎన్‌ఎఫ్‌సీ, గోల్కొండ కం టోన్మెంట్ ప్రాంతాల్లో మాక్‌డ్రిల్ ని ర్వహించనున్నారు. ఈ మాక్ డ్రిల్ సందర్భంగా సైరన్లు మోగనున్నాయి. డ్రిల్‌లో 12 సివిల్ డిఫెన్స్ సర్వీసులు పాల్గొననున్నాయి.
ప్రజ లు సహకరించాలని అధికారులు కో రారు. ఏపీలోని విశాఖపట్నంలో కూ డా రెండు ప్రాంతాల్లో డ్రిల్స్ నిర్వహించనున్నారు. అంతర్జాతీయ సరి హద్దు, కీలకమైన మౌలిక సదుపా యాలు, తీరప్రాంతం, పట్టణ ప్రాంత జనాభా తదితర అంశాలను బట్టి ప్రాంతాలను క్యాటగిరీలుగా విభజించారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.
ఏం జరగనుంది
ఈ డ్రిల్ సందర్భంగా వైమానిక దాడుల సమయంలో తమను తాము ఎలా రక్షించుకోవాలో పౌరులకు వివరించనున్నారు. డిల్స్ సమయంలో గగనతలంలో ఉండే సైరన్‌లు మోగుతాయి. ఆ సైరన్‌లు మోగిన వెంటనే పౌరులంతా తమ చుట్టుపక్కల ఉన్న సురక్షిత ప్రాంతాలకు వెళ్లి దాక్కోవాలి. మాక్ డ్రిల్స్ సందర్భంగా ఎంపిక చేసిన ప్రజలకు, వలంటీర్లకు శిక్షణ ఇవ్వను న్నారు. దాడులు జరిగితే చుట్టు పక్కల ప్రజలను సురక్షితంగా ఎలా తరలించాలి అనే దానిపై కూడా శిక్షణ ఉండనుంది.
ఏం దగ్గరుంచుకోవాలి..
నేడు నిర్వహించేవి మాక్ డ్రిల్స్ మాత్రమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సైరన్ విని భయాం దోళనకు గురి కావొద్దు. ఈ డ్రిల్స్ నిర్వహిస్తున్న సమయంలో నగదు, టార్చ్ లైట్లు, మెడికల్ కిట్స్ దగ్గరుంచుకోవాలని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇండ్లలో కూడా పైన పేర్కొన్న వస్తువులు ఉండేలా చూ సుకోవాలి. విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఎలా స్పందించే విధానం తెలుసుకునేందుకే ఈ డ్రిల్స్ నిర్వహిస్తున్నట్టు హోం శాఖ తెలిపింది.
పాఠశాలలు, కళాశాలలు తెరుచుకుంటాయా?
సివిల్ మాక్ డ్రిల్స్ జరిగే ప్రాంతాల్లో పాఠశాలలు తెరుస్తారా? లేక ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తారా అనేదానిపై ఎటువంటి స్పష్టత లేదు. పాఠశాలల నిర్వహణకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దేశవ్యాప్తంగా బ్యాంకు సేవలు యధావిధిగా కొనసాగుతాయని తెలుస్తోంది. బ్యాంకుల మూసివేత గురించి ఎటువంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు.