calender_icon.png 8 May, 2025 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్ర స్థావరాలపై దాడులను స్వాగతిస్తున్నా: అసదుద్దీన్ ఒవైసీ

07-05-2025 10:48:54 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత రక్షణ దళాలు లక్ష్యంగా దాడులు చేశాయనే నివేదికలకు ప్రతిస్పందనగా, దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు తమ ఆమోదం, ప్రశంసలను వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల నాయకులు ఈ ఆపరేషన్‌ను ప్రశంసించారు. ఈ చర్య భారతదేశ బలానికి నిదర్శనంగా అభివర్ణించారు. ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి తగిన ప్రతీకారంగా కూడా చాలామంది ఈ దాడులను భావించారు.పహల్గాం ఉగ్రదాడికి బదులు తీర్చుకున్నారంటూ, భారతదేశానికి మద్దతుగా దేశవ్యాప్తంగా జైహింద్ అంటూ నినాదాలు చేసుకొంటు ప్రజలు జాతీయ పతాకాలు చేతబూని వీధుల్లోకి  వచ్చారు.

ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాద్-ఉల్-ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో పోస్ట్ ద్వారా దాడులను స్వాగతించారు. పాకిస్తాన్‌లోని రహస్య ఉగ్రవాద స్థావరాలపై భారత రక్షణ దళాలు లక్ష్యంగా చేసుకున్న మెరుపు దాడులను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్బంగా అసదుద్దీన్ మాట్లాడుతూ.. పహల్గామ్ లాంటి సంఘటనను మరొకసారి జరగకుండా పాకిస్తాన్‌కు బలమైన గుణపాఠం నేర్పించాలన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. "జై హింద్" నినాదంతో ఆయన తన పోస్ట్‌ను ముగించారు.