07-05-2025 01:18:58 AM
పర్మిషన్లు లేకుండానే కాలేజీల్లో హాస్టళ్ల నిర్వహణ
* మాకు ఏ పాపం తెలియదంటున్న ఇంటర్ బోర్డు
శ్రీచైతన్య, నారాయణ కాలేజీల ఇష్టారాజ్యం
* చర్యలుండవా అని విద్యార్థి సంఘాల ప్రశ్న
హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): శ్రీచైతన్య, నారాయణ కాలేజీలు నిబంధనలు పాటించకుండా తమ ఇష్టానుసా రంగా వ్యవహరిస్తున్నాయి. అవి నడిపే హాస్టళ్లకు అనుమతులే ఉండవు. వాస్తవానికి కాలేజీలు తీసుకున్న అనుమతుల సర్టి ఫికెట్లను ఆ కాలేజీల్లో డిస్‌ప్లే చేయాలి. కానీ ఆ రెండు విద్యాసంస్థల్లో అలా చేయడంలేదు. దీనితో వేటికి అనుమతులు న్నాయో, వేటికి లేవో తెలియని పరిస్థితి నెలకొంది.
రాష్ట్రంలోని 1405 ప్రైవేట్ కాలేజీల్లో 250 దాకా కార్పొరేట్ కాలేజీలున్నాయి. ఇందులోనూ శ్రీచైతన్య కాలేజీ లు దాదాపు 100 వరకు ఉంటే, నారాయణ కాలేజీలు దాదాపు 80. వీటిలో డేస్కాలర్స్ కాలేజీలు చాలా తక్కువ. శ్రీచైతన్య, నారాయణకు డేస్కాలర్స్ కాలేజీలు దాదాపు 20 చొప్పున ఉంటాయి. అయితేనేం, అన్ని కాలేజీల్లో అవి హాస్టళ్లు నిర్వహిస్తున్నాయి.
ఇలా ఈ రెండు కార్పొరేట్ కాలేజీలే మొత్తం ఇంటర్మీడియట్ విద్యారంగాన్ని శాసిస్తున్నాయి. వీటిలోని ఏ కాలేజీకి హాస్టల్ నిర్వహణకు అనుమతుల్లేవు. ఇంటర్ బోర్డు కూడా ఇదే స్పష్టం చేస్తోంది. తాము ఏ కాలేజీకి హాస్టల్ నిర్వహణకు అనుమతినివ్వలేదని అధికారులు చెప్తున్నారు. హాస్టళ్లకు అనుమతులిచ్చే అంశం కూడా తమ పరిధిలోనిది కాదని అధికారులు అంటున్నారు.
ఫుడ్డు.. బెడ్డూ అధ్వానమే..
ఫీజు ఎంతైనా లెక్కచేయకుండా తమ పిల్లలను తల్లిదండ్రులు లక్షన్నర నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చుచేసి శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లో చేర్పిస్తున్నా రు. ఇది మొత్తం ఫీజు. ఇందులో హాస్టల్ ఫీజు ఒక్కో బ్రాంచీలో ఒక్కోలా వసూలు చేస్తున్నారు. రూ.1.60 లక్షలు మొత్తం ఫీజు ఉంటే అందులో హాస్టల్, ధోబీ ఫీజు కలిపి రూ.70 వేల నుంచి రూ.80 వేలు పిండుతున్నారు.
క్లాస్‌లు, హాస్టళ్లలో ఏసీ సౌకర్యం ఉంటే రూ. 2.50 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ఇందులో హాస్టల్ ఫీజే రూ.1.10 లక్షల వరకు వేస్తున్నట్లు తెలుస్తోంది. మాదాపూర్ ప్రాంతంలో నారాయణ, శ్రీచైతన్య కాలేజీల్లో హాస్టల్ ఫీజే రూ.1.50 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. జేఈఈ లాంటి స్పెషల్ బ్రాంచి విద్యార్థులకు నాణ్యమైన మంచి భోజనం పెడితే, మిగతా వారికి మాత్రం సాధారణ భోజనం పెడుతున్నారు.
ఇంతేసి ఫీజులు వసూలు చేస్తున్నా.. హాస్టళ్లలో పరిస్థితులు దారుణంగా ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా హాస్టల్ గదుల్లో ఏసీకి ప్రత్యేకించి ఫీజు కట్టించుకుంటున్నారు. వేసవికాలం ముగుస్తోది. వచ్చేది వర్షాకాలం, ఆ తర్వాత చలికాలమే. ఏసీని పెద్దగా విద్యార్థులు వాడే పరిస్థితి ఉండదు. కానీ ఫీజులు ఏడాది కాలానికి కట్టల్సిందే.
కాలేజీల హాస్టళ్ల నిర్వహణపై కొందరు విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు ఇంటర్ బోర్డు అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న దాఖలాల్లేవు. వీటిపై నియంత్రణ లేకుండా పోయింది. మహిళా హాస్టళ్ల పరిస్థితి అయితే మరీ దారుణం. ఆ హాస్టళ్లలో సరిగా వెంటిలేషన్ ఉండదు. ఇరుకు గదుల్లో వాష్ రూమ్స్ కూడా సరిగా ఉండని పరిస్థితి.
బహుళ అంతస్తుల్లో..
చాలా వరకు ఈ కాలేజీలు బహుళ అంతస్తుల్లోనే నిర్వహిస్తున్నారు. అందులోనే హాస్టల్, డైనింగ్ హాల్స్, క్లాస్ రూములు ఉంటాయి. మూడంతస్తుల భవనానికి అనుమతులు తీసుకొని ఐదు అంతస్తుల భవనాల్లో కాలేజీలను నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల సొంత బిల్డింగ్‌లలో నిర్వహిస్తుంటే, మరికొన్ని చోట్ల అద్దె భవనాల్లో కాలేజీలను నిర్వహిస్తున్నారు. కింద షాపింగ్ మాల్స్, పైఅంతస్తులో కాలేజీలను నిర్వహిస్తున్నారు.
మాదాపూర్, కొండాపూర్, ఆదిబట్ల, రావిర్యాల, మియాపూర్, కోహెడ్, బొంగుళూరు లాంటి బ్రాంచీల్లో నిబంధనలు మేరకు 20 నుంచి 25 మంది (పెద్ద గదులు) ఉండాల్సిన ఒక్కో గదిలో 40 వరకు సింగిల్ బెడ్స్ వేసి ఉంచుతున్నారు. ఒకవేళ సరిపోకుంటే డబుల్ డెక్కర్ బెడ్లను సైతం వేసి 80 మందికిపైగా విద్యార్థులను ఉంచుతున్నారని సమాచారం. ఇక చిన్న గదుల్లోనైతే ఆరు నుంచి పదిమంది వరకు ఉంచుతున్నారు.
అదే రూములో అటాచ్డ్ వాష్ రూము ఇస్తున్నారు. ఒక్కో తరగతి గదిలో సగటున 40 మంది మించరాదని నిబంధనలు చెప్తున్నా 60 మందికిపైనే ఉంచి తరగతులును నిర్వహిస్తున్నారు. హాస్టళ్లలో నాణ్యమైన భోజనం పెట్టడంలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రుచి, పచి ఉండదు. పేరుకు మాత్రం మూడు రకాల కూరగాయలతో భోజనం పెడుతున్నారు.
తమ పిల్లను కాలేజీల్లో జాయిన్ చేయించేటప్పుడు మాత్రం ఇంటి భోజనంలా ఫుడ్ పెడ్తామని ప్రచారం చేసుకుంటున్నారు. గతంలో ఈ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇటు ఫీజుల నియంత్రణ, అటు నిబంధనల అమలులో అధికారులు నిర్లక్ష్యం కారణంగా కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది.
ఆటలే ఉండవు..
కాలేజీల్లో ఎప్పుడూ చదువే.. అసలు ఆటలే ఉండవు. వారానికి వారం రోజులు క్లాసులు నిర్వహిస్తున్నారు. దసరా, సంక్రాంతి లాంటి ముఖ్యమైన పండగలకు మినహాయిస్తే సెలవులే ఉండవు. విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి లేనిదే కాలేజీ గేట్ కూడా దాటనీయరు. ఒకవేళ విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్ చేస్తే తప్ప. నిజానికి కాలేజీ అంటే అందులో ప్లేగ్రౌండ్, పార్కింగ్, గ్రీనరీ లాంటివి ఉండాలి.
లైబ్రరీలు, ల్యాబ్‌లు, ఆడిటోరియం తప్పనిసరిగా ఉండాలి. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి. కానీ ఇలాంటివేవీ ఈ కార్పొరేట్ కాలేజీల్లో కనిపించడం లేదు. నారాయణ, శ్రీచైతన్య కాలేజీల్లో అడ్మిషన్లు ఎంతకీ అయిపోవు. అయిపోయాయని చెప్తూనే వచ్చిన వారిని వచ్చినట్లుగా జాయి న్ చేసుకొని ఆ మేరకు అద్దె భవనాలను తీసుకొని కొత్త బ్రాంచీలను ఇష్టానుసారంగా తెరిచేస్తున్నారు.
విద్యార్థుల రోజువారి దినచర్య ఇలా..
ఉదయం నాలుగైదు గంటలకు విద్యార్థులను హాస్టల్ వార్డెన్ నిద్ర లేపుతారు. ఆతర్వాత ఉదయం 6 గంటలకు టిఫిన్ పెడతారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు తరగతులు. ఓ అర గంట లంచ్ బ్రేక్. మళ్లీ సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు. 5 గంట బ్రేక్. 6 నుంచి పది, పదకొండు గంటల వరకు స్టడీ హవర్స్. ఈ మధ్యలోనే డిన్నర్ పెడతారు.
చేతులెత్తేస్తున్న అధికారులు..
ప్రతీసారి హాస్టళ్లు తమ పరిధిలోకి రావని చెబుతూ ఇంటర్ బోర్డు అధికారులు చేతులెత్తేస్తున్నారు. అయితే అప్పటి విద్యాశాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రంజీవ్ ఆచా ర్య...హాస్టళ్లు కూడా కళాశాలల్లో భాగమేనని చెప్పారు. దీంతో ఇంటర్ బోర్డు అధికారులు 2018లో హాస్టళ్లకు కూడా అనుమతులు ఉండాలని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వులపై కొన్ని కాలేజీలు ఇంటర్ బోర్డుకు ఆ అధికారం లేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఆరేడు సంవత్సరాలవుతున్నా ఆ సమస్య ఇంత వరకూ కొలిక్కి రాలేదు.
హాస్టళ్లు మా పరిధిలోకి రావు: ఇంటర్ బోర్డు
శ్రీచైతన్య, నారాయణ కాలేజీల కు కేవలం తరగతుల నిర్వహణకే తా ము అనుమతులిస్తామని ఇంటర్ బో ర్డు తెలిపింది. అందులోని హాస్టళ్లు త మ పరిధిలోకి రావని పేర్కొంది. ఏ కాలేజీలకు ఇంత వరకూ అనుమతినివ్వలేదు. అఫిలియేషన్ కేవలం క్లా సుల నిర్వహణకు మాత్రమే ఇస్తామ ని ఇంటర్ బోర్డు తెలిపింది. ఒకవేళ క్లాసులను సెలవుల్లో నిర్వహిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు రెండు టాస్క్ ఫోర్స్ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. గత నెలలో కాలేజీల యాజమాన్యాలతో సమావేశమై ఇదే విషయం స్పష్టం చేసినట్లు బోర్డు పేర్కొంది.
ఎందుకు పట్టించుకోవడంలేదు: టి.నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి
నారాయణ, శ్రీచైతన్య కాలేజీలు హాస్టళ్లను అనుమతుల్లేకుండా నడిపిస్తుంటే అవి తమ పరిధిలో లేవని ఇంటర్ బోర్డు ఎలా చెప్తోంది?. మరి ఎవరి చేతిలో ఉన్నాయో తేల్చాలి. కాలేజీలేమో కళాశాల, హాస్టల్ కలుపుకొని ఫీజులు వసూలు చేస్తున్నారు. జిల్లాల్లో మాత్రం హాస్టళ్లు జిల్లా విద్యాధికారుల పరిధిలో వస్తాయంటున్నారు. సామర్థ్యం కంటే ఎక్కువ మంది విద్యార్థులను గదుల్లో కుక్కుతున్నారు.
సరైనా సదుపాయాలుండవు: కె.మణికంఠ రెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
శ్రీచైతన్య, నారాయణ హాస్టళ్లలో విద్యార్థులకు సరైనా సదుపాయాలుండవు. హాస్టళ్ల లో ప్రత్యేక సదుపాయాలంటూ అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారు. జైళ్లను తలపించేలా హాస్టళ్లు ఉంటున్నాయి. ఒకే గదిలో 30 మందికి పైగా విద్యార్థులను ఉంచుతున్నారు. ఇంటర్ బోర్డు అధికారులు హాస్టళ్లలో తనిఖీలు చేయడంలేదు. ఆహార నాణ్యత ఉండకపోవడంపై ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు కూడా చేయట్లేదు. ఆ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి.-