07-05-2025 12:54:50 AM
ప్రభుత్వంలో కార్మికుల విలీనం.. కారుణ్య నియామకాలపై
హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): ఆర్టీసీ జేఏసీ నేతలు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో జరిపిన చర్చలు సఫలమయ్యా యి. దీంతో బుధవారం నుంచి తలపెట్టిన సమ్మెపై జేఏసీ వెనక్కి తగ్గింది. ప్రభుత్వంపై నమ్మకం ఉంచి సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
సర్కార్ చెప్పినవిధంగా నిర్దేశిత సమయానికి తమ సమస్యలకు పరిష్కారం లభించకపోతే సమ్మె అస్త్రా న్ని ప్రయోగించి తీరుతామని తేల్చిచెప్పింది. ఆర్టీసీ జేఏసీ సమ్మె అంశంపై మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ కోదండరాం నేతృత్వంలో ఆర్టీసీ జేఏసీ నేతలు ఈదురు వెంకన్న, థామస్‌రెడ్డి హైదరాబాద్‌లోని సెక్రటేరియేట్‌లో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా జేఏసీ నేతలు ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి వెంటనే స్పందిస్తూ.. కార్మికుల సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. దీంతో జేఏసీ నేతలు సమ్మె విరమణకు అంగీకరించారు.
చర్చల్లో దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్‌రెడ్డి, జేఏసీ నేతలు కే హనుమంతు ముదిరాజ్, ఎండీ మౌలానా, కత్తుల యాదయ్య, సుద్దాల సురేశ్, యాదగిరి పాల్గొన్నారు. ఏదేమైనప్పటికీ కార్మికులతో సమ్మె విరమింపజేసేలా చేసి ఒకరకంగా సర్కార్ సమ్మె సమస్యను తాత్కాలికంగా అధిగమించినట్లయింది.
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు..
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఇప్పటివరకు ప్రభుత్వానికి మూడు సార్లు సమ్మె నోటీసు ఇచ్చామని జేఏసీ నేతలు తెలిపారు. మూడోసారి కార్మికులు ఇక సమ్మె చేసి తీరుతారని తెలిసి ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించిందని చెప్పుకొచ్చారు. సర్కార్ ఇప్పటికైనా కార్మికుల సమస్యలను ఆలకించి, వాటి పరిష్కారంపై హామీ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.
ట్రేడ్ యూనియన్ గుర్తింపు అంశంపై సర్కార్ సానుకూలంగా స్పందించిందని, మంత్రి పొన్నం యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాననిహామీ ఇచ్చారని వివరించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపైనా సానుకూల స్పందనే వచ్చిందని వెల్లడించారు.
కండక్టర్లు, డ్రైవర్లు చేసిన చిన్న చిన్న పొరపాట్లకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం సరికాదని, నిబంధనలను కాస్త సడలించాలని, కారుణ్య నియామకాలకు అవకాశం ఇవ్వాలని, తద్వారా కార్మికుల వారసులకు ఉద్యోగ భద్రత వస్తుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు.
ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులు కాకుండా, ప్రభుత్వమే వాటిని కొని ఆర్టీసీ యాజమాన్యానికి అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామని, దీనిపై కూడా సర్కార్ పునరాలోచిస్తామని తెలిపిందన్నారు. ఈ అంశంపై ఇప్పటికే కేంద్రం ప్రభుత్వానికి లేఖ రాసినట్లు మంత్రి పొన్నం స్పష్టం చేశారన్నారు. అలాగే బకాయిలతో పాటు ఇతర సమస్యలపైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు.
మంత్రి పొన్నంతో ఇతర సంఘాల భేటీ
ఆర్టీసీ పరిధిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై టీఎంయూ జనరల్ సెక్రటరీ అశ్వత్థామరెడ్డి, ఐఎన్‌టీయూసీ నేత రాజిరెడ్డి, ఎన్‌ఎంయూ నేత నరేందర్, కార్మిక్ సంఘ్ నేత ఎర్రస్వామి, ఎస్టీఎంయూ నేత హరికృష్ణ మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌తో భేటీ అయ్యారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి సైతం అనేకసార్లు ఆర్టీసీ కార్మికుల సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని గుర్తుచేశారు. ఆర్టీసీ కార్మికులకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోదని మంత్రి స్పష్టం చేశారు.