07-05-2025 01:04:13 AM
హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని నడుపుతున్నా రా లేక సర్కస్ నడుపుతున్నారా అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు మండిపడ్డారు. తెలంగాణ దివాళా తీసినట్లుగా మాట్లాడుతున్న సీఎం కుటుంబసభ్యుల ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయని ప్రశ్నించారు. ‘మమ్మల్ని.. మా పార్టీని ఎన్ని తిట్టినా భరిం చాం కానీ, తెలంగాణ ప్రతిష్ఠ దెబ్బతీసేలా మాట్లాడితే సహించేది లేదు.
తెలంగాణను తిడితే ఊరుకోం.. ఇక మీదట కేసీఆర్‌ను దూషిస్తే నాలుక చీరేస్తాం’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.. సీఎం రేవంత్‌రెడ్డి మాటలు రాష్ట్ర భవిష్యత్‌కు శాపం పెట్టేలా ఉన్నాయన్నారు. ఢిల్లీ పార్టీలను నమ్మవద్దని కేసీఆర్ ఎన్నికలప్పుడే చెప్పారని, ఆయన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయన్నారు.
సీఎం రేవంత్‌కు పాలన చేతకాదని తేలిపోయిందని, కాడి కింద పడేశారని విమర్శించారు. ఎన్నికల ముందు అధికారం కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చి అమలు చేయలేక తప్పించుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కదం తొక్కిన ఉద్యోగులను రేవంత్ అవమానిస్తున్నారని, ఉద్యోగులకు, ప్రజలకు మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో అంశాలనే ఉద్యోగులు అడుగుతున్నారని, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్‌కు పైసలు లేవా అని కేటీఆర్ ప్రశ్నించారు.
తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి..
కేసీఆర్ తీసుకొచ్చిన అప్పు అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించారని, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఇంటింటికీ నల్లా నీళ్లు, 24 గంటల వెలుగు జిలుగుల తెలంగాణగా తీర్చిదిద్దారని ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేశారని కేటీఆర్ వివరించారు. 17 నెలల రేవంత్ పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హెలికాప్టర్ల కోసం మం త్రులు కొట్టుకుంటున్నారని, షేర్ ఆటోలా హెలికాప్టర్‌ను వాడుకుంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
పాలన చేతకాదని ఒప్పుకొని తెలంగాణ సమాజానికి రేవంత్ క్షమా పణ చెప్పాలని, ఉద్యోగులు రేవంత్ ఆలోచన విధానాన్ని గమనించాలన్నారు. పరిపా లన అంటే బజారు భాష మాట్లాడినంత ఈజీకాదని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. తెలంగాణ రైజింగ్.. అంటూ అందాల పోటీలకు పైసలు ఉంటాయి కానీ, ఇచ్చిన హామీలు అమలుచేసేందుకు ఉండ వా అని కేటీఆర్ ప్రశ్నించారు.
17 నెలల్లో అస్తవ్యస్తం చేశారు..
ఆదాయం పెరిగిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతిలో పెట్టామని, మొదటి శ్వేతపత్రంలో బీఆర్‌ఎస్ రూ.6 లక్షల కోట్లు అప్పులు చేసిందని, ఇప్పుడేమో రూ.8.50లక్షల కోట్ల అప్పు చేసిందంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ నెలకు రూ.2వేల కోట్ల అప్పులు చేస్తోందని, అప్పుల్లో తెలంగాణ 28వ స్థానంలో ఉందని పార్లమెం టులో కేంద్రమే చెప్పిందని అన్నారు.
గడిచిన పదేళ్లలో తెలంగాణ తలసరి ఆదాయం లో నంబర్‌వన్‌గా ఉందన్నారు. బంగారు తెలంగాణను 17నెలల్లో అస్తవ్యస్తం చేశారని ఆరోపించారు. స్టాంప్స్ అండ్ రిజిష్ర్టేషన్లలో 2024 ఏడాదికి రూ.14 వేల కోట్లు మాత్రమే వచ్చిందని, హైడ్రా పేరుతో పేదవాడి కడుపు మీద కొట్టారని విమర్శించారు. సీఎం రేవంత్ పాలనలో తెలంగాణ జీరో శాతం గ్రోత్ రేట్‌తో అట్టడుగున ఉన్నదని, రాష్ట్రం దివాళా తీసిందని ఎవరైనా బజారున పెట్టుకుంటారా అని ప్రశ్నించారు.
ఢిల్లీకి 43సార్లు పోతే రూ.43లు కూడా తీసుకురాలేకపోయారని, రేవంత్‌రెడ్డి ఢిల్లీ ట్రిప్ ఫొటోలన్నీ బయటపెడతామని కేటీఆర్ ధ్వజమెత్తారు. సీఎం కుటుంబ సభ్యుల ఆదాయం పెరుగుతోందని, వేల కోట్లతో ఫార్మా కంపెనీ పేరుతో లగచర్ల భూములు గుంజుకుంటున్నారని, వియ్యంకుడి అప్పులన్నీ రైటాఫ్ అయిపోయాన్నారు. జూబ్లీహి ల్స్ ప్యాలెస్ మూడింతలు పెరిగిందని, 2 వేల ఎకరాలు కొన్నారని ఆ సీక్రెట్స్ ప్రజలకు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.