పోలీస్ వాహనం ఢీకొని ఏఎస్ఐ మృతి... కక్షపూరితంగానే హత్య?
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలోని మనూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం నాడు ఒక పోలీసు వాహనం ఢీకొనడంతో, గోవింద్ నాయక్ అనే అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (Assistant Sub-Inspector) మృతి చెందారు. పోలీసు అధికారుల ప్రకారం, ఆ వాహనం సదరు అధికారిని ఢీకొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ప్రమాదం జరిగిన వెంటనే రామారావుగా గుర్తించబడిన వాహన డ్రైవర్ పరారయ్యాడు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఎస్సై గోవింద్ నాయక్ పై కక్షపూరితంగానే పోలీసు వాహనం తీసుకెళ్లి హత్య చేశాడు అంటూ మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కచ్చితమైన పరిస్థితులను తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.




