14 April, 2026 | 1:13 PM

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు కేసీఆర్ ఘన నివాళి

14-04-2026 11:07 AM

హైదరాబాద్: ​రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి(Ambedkar Jayanti) సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (Kalvakuntla Chandrashekar Rao) తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ 135వ జయంతిని పురస్కరించుకుని జాతికి అంబేద్కర్ చేసిన కృషిని, సేవలను కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) స్మరించుకున్నారు. ​అన్ని రంగాల్లో వివక్షారహిత సామాజిక సమానత్వం కోసం, వర్ణ, కుల, మత, లింగ భేదాలు లేకుండా భారతదేశ ఔన్నత్యాన్ని నిలిపే దిశగా కృషి చేసిన మహాదార్శనికుడు అంబేద్కర్ అనిఆయన కొనియాడారు. భారత సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాల్లో మానవీయత పరిఢవిల్లి, విశ్వనరుడుగా భారత పౌరుడు ఎదిగేందుకు దోహదం చేసేలా రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ ప్రపంచ మేధావి అన్నారు.

అంబేద్కర్ అందించిన రాజ్యాంగంలోని(Constitution of India) ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని, దేశ ఫెడరల్ వ్యవస్థ(Federal System) బలోపేతానికి అంబేద్కర్ చేసిన కృషి మహోన్నతమైనదని పేర్కొన్నారు. దళిత బహుజన వర్గాల అభ్యున్నతి కోసం, అంబేద్కర్ ఆశయాల సాధన కోసం మొదటి పదేళ్ల పాలనలో తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం విప్లవాత్మక కార్యాచరణను అమలు చేసిందని తెలిపారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో డా. బి.ఆర్. అంబేద్కర్ పేరుతో సచివాలయాన్ని నిర్మించుకుని, రాష్ట్ర పరిపాలనలో అంబేద్కర్ స్ఫూర్తిని నింపే దిశగా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలను నిత్యం స్మరించుకుంటూ, ఆయన ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేందుకు, రేపటి తరాల్లో నిత్య చైతన్యం కలిగించేందుకు, దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా ఆకాశమంత ఎత్తున అంబేద్కర్ ప్రతిరూపాన్ని, విగ్రహ రూపంలో హైదరాబాద్ నడిబొడ్డున ప్రతిష్టించుకున్నామని వెల్లడించారు.

శతాబ్దాల కాలంగా సామాజిక వివక్షకు గురవుతున్న ఎస్సీ కులాల ఆత్మగౌరవం ద్విగుణీకృతం కావాలనే లక్ష్యంతో, వారికి మున్నెన్నడూ లేని విధంగా పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని 'దళిత బంధు' పథకం ద్వారా అందించిన విషయాన్ని కేసీఆర్ గుర్తుచేశారు. తద్వారా దళితులు ప్రభుత్వం అందించే పెట్టుబడితో వ్యాపారవేత్తలుగా ఎదిగి స్వయం ఉపాధి పొందడమే కాకుండా, పదిమందికి ఉద్యోగాలిచ్చే ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదిగేలా కృషి చేశామని, అద్భుతమైన ఫలితాలు కూడా సాధించామని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సహా, బీసీల ప్రగతి కోసం, మహిళాభ్యున్నతికి నాటి బీఆర్ఎస్ సర్కార్(BRS Government) కృషి చేసిందని, వాటి కొనసాగింపు ద్వారా మాత్రమే రాష్ట్రంలో బహుజన అభ్యున్నతి సాధ్యమవుతుందని, అప్పుడే మనం అంబేద్కర్ కు ఘన నివాళి అర్పించిన వారమౌతామని కేసీఆర్ పేర్కొన్నారు.