22-05-2025 01:42:11 AM
ఐదేళ్లలో 674 నుంచి 891కి చేరిక
న్యూఢిల్లీ, మే 21: గుజరాత్‌లో ఆసియా సింహాల సంఖ్య భారీగా పెరిగినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐదేళ్లకోసారి గిర్ అటవీప్రాంతంలో నివసించే ఆసియా సింహాల సంఖ్యను లెక్కిస్తారు. ఈ నేపథ్యంలోనే మే 10, 11 తేదీల్లో సింహాల ప్రాథమిక జనాభా గణన నిర్వహించగా, 12, 13 తేదీల్లో తుదిగణన చేపట్టారు. దాదాపు మూడు వేల మంది సింహాల లెక్కింపులో భాగస్వాములయ్యారు.
ఐదేళ్ల కింద 674గా ఉన్న ఆసియా సింహాల సంఖ్య ఈ ఏడాది ఇప్పటివరకు 891కి పెరిగినట్టు అధికారులు వెల్లడించారు. జునాగఢ్, గిర్ సోమనాథ్, భావ్‌నగర్, రాజ్‌కోట్, మోర్బి, సురేంద్రనగర్, దేవభూమి ద్వారక, జామ్‌నగర్, అమ్రేలి, పోరుబందర్, బోటాడ్ జిల్లాల్లో ఈ సింహాలు విస్తరించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఆసియా సింహాల సంఖ్య పెరుగుతున్న వేళ మృగరాజులను చూసేందుకు పర్యాటకులు సైతం భారీగా తరలివస్తున్నారు.
1936లో ఇక్కడ తొలిసారిగా సింహాల లెక్కింపును ప్రారంభించారు. తొలిసారి లెక్కించినప్పుడు సింహాల సంఖ్య 287గా వచ్చింది. ఇది 1995 నాటికి 304గా, 2001లో 327గా, 2005కు వచ్చేనాటికి 359కు చేరింది. సింహాల సంఖ్య 2010 నాటికి 411కు, 2015కు 523కు, 2020 నాటికి 674కు చేరుకుంది.
తాజా లెక్కింపులో ఈ సంఖ్య 891కి చేరడం విశేషం. ఆసియా సింహాలు కేవలం గుజరాత్‌కే కాకుండా మొత్తం భారతదేశ వన్యప్రాణుల వారసత్వానికి చిహ్నం. మేక్ ఇన్ ఇండియా ప్రచార లోగోలో సైతం ఈ సింహామే ప్రముఖంగా కనిపిస్తుంది.