వడ్డీ రేట్లు పెరిగిన తరుణంలో... డెట్ ఫండ్ నుంచి ఎఫ్‌డీలోకి షిఫ్ట్ కావొచ్చా!
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్ల వరకూ (0.75 శాతం) పెంచింది. బ్యాంక్ ఎఫ్‌డీలు గ్యారంటీ రాబడులును ఇచ్చే మదుపు సాధనాలు. ఇదే సమయంలో బ్యాంక్ ఆఫర్ చేసే వడ్డీ రేట్లు పెంచినందున ఎఫ్‌డీలు మరింత ఆకర్షణీయంగా మారాయి. కాస్త రిస్క్‌తో కూడిన డెట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ నుంచి మీ పెట్టుబడులను తీసి, ఎఫ్‌డీ చేయడం స్వల్పకాలికంగా మంచి ఐడియానే. అయినప్పటికీ, డెట్ ఫండ్ నుంచి ఎఫ్‌డీకి షిఫ్ట్‌కావడంతో తొందరపాటు అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. మీ ఇన్వెస్ట్‌మెంట్ లక్ష్యం, రిస్క్ తీసుకునే సామర్థ్యం ఆధారంగా అటువంటి నిర్ణయాన్ని తీసుకోవచ్చని చెపుతున్నారు.
పెట్టుబడి కాలపరిమితి ప్రధానం
ఏమాత్రం స్వల్పకాలిక హెచ్చుతగ్గులు లేకుండా స్థిర వడ్డీని అందుకోవాలనుకుంటే డెట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టరు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లోకి మారడం మంచిదేనని ఫైనాన్షియల్ రేడియన్స్ వ్యవస్థాపకుడు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రాజేశ్ మినోచా సూచించారు. భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గనున్నందున, ఇప్పుడ అధిక వడ్డీ ఇస్తున్న ఎఫ్‌డీవైపు ఇన్వెస్టర్లు చూడవచ్చన్నారు. ఇదే సమయంలో ఎఫ్‌డీ కాలపరిమితిని, తన నిధుల అవసరాలను ఇన్వెస్టర్లు జాగ్రత్తగా సరిచూసుకుని నిర్ణయం తీసుకోవాలని రాజేశ్ సిఫార్సుచేశారు.
ఎస్బీఐ తాజాగా 46 రోజుల నుంచి 179 రోజుల కాలపరిమితిగల డిపాజిట్లపై వడ్డీ రేటును 75 బేసిస్ పాయింట్లు పెంచి 4.75 శాతం నుంచి 5.50 శాతానికి చేర్చింది. 180 రోజుల నుంచి 210 రోజుల కాలపరిమితిగల ఎఫ్‌డీపై వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్ల పెరుగుదలతో 5.75 శాతం నుంచి 6 శాతానికి చేరింది. 211 రోజుల నుంచి 1 ఏడాదిలోపు ఎఫ్‌డీపై రేటు 6 శాతం నుంచి 6.25 శాతానికి పెరిగింది. స్వల్పకాలిక ఎఫ్‌డీపైనే ఎస్బీఐ అధికంగా 75 బేసిస్ పాయింట్ల మేర రేటును పెంచిందని ఇన్వెస్టర్లు గుర్తించి నిర్ణయం తీసుకోవాలన్నారు.
ఎఫ్‌డీ వర్సెస్ డెట్ ఫండ్స్
ఫిక్స్‌డ్ డిపాజిట్లను, డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ను పోల్చిచూస్తే ఎఫ్‌డీల్లో పెట్టుబడులకు రిస్క్ చాలా తక్కువ. అవి నిర్ణీతకాలంలో గ్యారంటీ రాబడుల్ని అందిస్తాయి. ఎఫ్‌డీలతో పోలిస్తే వడ్డీ రేట్ల మార్పులతో డెట్ ఫండ్స్‌లో కాస్త ఎక్కువ రిస్క్ ఉంటుంది. మరో కీలకమైన అంశం పన్నులు. ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీలో చేసే పెట్టుబడులకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద మినహాయింపు వర్తిస్తుంది. కానీ డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు ఆ మినహాయింపును 2023 బడ్జెట్లో తొలగించారు. డెట్ ఫండ్స్ నుంచి వచ్చే రాబడులకు పన్ను ఇన్వెస్టర్ల వ్యక్తిగత ఐటీ శ్లాబ్ ప్రకారం ఉంటుంది.
ఎఫ్‌డీలపై వచ్చే వడ్డీ ఆదాయంపై కూడా వ్యక్తిగత శ్లాబ్ ప్రకారం పన్ను పడుతుంది. మరోక కీలకాంశం ఏమిటంటే ఎఫ్‌డీ కాలపరిమితి ముగిసి, రెన్యువల్ చేసే ప్రతీ సందర్భంలోనూ టీడీఎస్‌ను బ్యాంక్ కట్ చేస్తుంది. అదే డెట్ మ్యూచువల్ ఫండ్స్‌కయితే టీడీఎస్ కటింగ్ ఉండదు. ఫండ్ యూనిట్లను ఇన్వెస్టర్లు రిడీమ్ చేసుకున్నపుడే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ వ్యత్యాసాల్ని మినహాయిస్తే ఫిక్స్‌డ్ డిపాజిట్లు, డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఒకే తరహాకు చెందినవి.
ఎఫ్‌డీతో రాబడి గ్యారంటీ
ఫిక్స్‌డ్ డిపాజిట్లు గ్యారంటీతో స్థిరమైన రాబడులను ఇస్తాయని, ప్రత్యేకించి ఒడిదుడుకులకు లోనయ్యే మార్కెట్లలో ఇవి ఆకర్షణీయమైనవని ప్రైమ్ వెల్త్ ఫిన్‌సర్వ్ డైరెక్టర్ చక్రవర్తి చెప్పారు. అవి సాధారణంగా సురక్షిత పెట్టుబడులని, రూ. 5 లక్షల డిపాజిట్ వరకూ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందన్నారు. కానీ ఎఫ్‌డీలకు లేని కొన్ని ప్రయోజనాలు డెట్ మ్యూచువల్ ఫండ్స్‌తో ఉంటాయని, సానుకూల మార్కెట్ పరిస్థితుల్లో ఇవి ఎఫ్‌డీలకంటే అధిక రాబడుల్ని అందిస్తాయని వివరించారు. అందుచేత మీరు డెట్ ఫండ్ నుంచి ఎఫ్‌డీలోకి పెట్టుబడి మార్చడం మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యానికి లోబడి ఉంటుందన్నారు.
దీర్ఘకాలానికి డెట్ ఫండ్స్ రాబడులు అధికం
వడ్డీ రేట్లు పెరుగుతున్న తరుణంలో డెట్ మ్యూచువల్ ఫండ్స్ నికర ఆస్తుల విలువ (ఎన్‌ఏవీ)పై ప్రతికూల ప్రభావం పడుతుంది. కానీ బాండ్ ఈల్డ్స్ పెరుగుదలతో ఇవి దీర్ఘకాలంలో ప్రయోజనాన్ని ఇస్తాయి. గత చరిత్రను పరిశీలిస్తే సాధారణంగా దీర్ఘకాలిక ఎఫ్‌డీలకంటే అదే మెచ్యూరిటీ సమయంలో డెట్ ఫండ్స్ రాబడులు ఎక్కువగా ఉన్నాయి. అధిక పన్ను శ్లాబ్‌ల్లో ఉన్నవారికైతే డెట్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లాంగ్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను ప్రయోజనం లభిస్తుంది. కానీ ఎఫ్‌డీలు సురక్షితమైన గ్యారంటీ రాబడుల్ని అందిస్తాయి. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు కలిగినవారు లాంగ్ టెన్యూర్ డెట్ ఫండ్స్‌ను ఎంచుకోవాలని, స్వల్పకాలిక ఆర్థిక అవసరాలు కలిగినవారు ఎఫ్‌డీ లేదా లిక్విడ్, అల్ట్రాషార్ట్, మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేసుకోవాలని రాజేశ్ మినోచా సూచించారు.






