19 March, 2026 | 8:01 AM

హోర్ముజ్ వద్ద 2,200 బంకర్ బస్టర్ల దాడి

19-03-2026 12:00 AM
  1. ఇరాన్ భూగర్భ క్షిపణి స్థావరాలపై అమెరికా దాడి
  2. జలసంధి వద్ద ఇంధన రవాణాకు ముప్పుగా యాంటీ-షిప్ క్రూజ్ క్షిపణులు
  3. అందుకే 5వేల పౌండ్ల బాంబుల వర్షం
  4. ఎక్స్‌లో పేర్కొన్న యూఎస్ సెంట్రల్ కమాండ్

టెహ్రాన్, మార్చి 18: యూఎస్ ఇరాన్ మధ్య యుద్ధం భీకరంగా జరు గుతోంది. దీంతో పశ్చిమాసియాలో తీవ్రఉద్రిక్తతలు రోజూ విజృంభిస్తూనే ఉన్నాయి. ఇంధన రవాణాకు జీవనాడి అయిన హో ర్ముజ్ జలసంధిని తన గుప్పిట్లో పెట్టుకున్న ఇరాన్‌ను అడ్డుకునేందుకు అమెరికా బుధవారం భీకర దాడులు చేసింది. ఈ జలసంధి సమీపంలోని భూగర్భ క్షిపణి స్థావరంపై 2,200 కిలోల బంకర్ బస్టర్ల బాంబుల వ ర్షం కురిపించింది. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. హోర్ముజ్ జలసంధికి సమీపంలోని ఇరాన్ క్షిపణి స్థావరాల్లో ఉన్న యాంటీ-షిప్ క్రూజ్ క్షిపణులు..

అంతర్జాతీయ సముద్ర రవాణాకు ముప్పు గా మారాయని, అందుకే ఈ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నామని యూఎస్ సెంట్రల్ కమాండ్ ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొంది. దీంతో భారీ లోతులో ఉన్న లక్ష్యాలను ఢీకొనేలా 5వేల పౌండ్ల (దాదాపు 2200 కిలోలకు పైమాటే) శక్తిమంతమైన బంకర్ బస్టర్ బాంబులతో విజయవంతంగా దాడులు చేశామని వెల్లడించింది. ఇరాన్ తీర రక్షణ నెట్‌వర్క్‌లో భాగమైన ఆయుధ నిల్వలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా చెప్పింది. హోర్ముజ్‌లో ఇంధన రవాణా నిరంతరాయంగా జరగాలంటే ఈ నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేయాల్సిన అవసరం ఉందని అగ్రరాజ్యం భావిస్తోంది.

తద్వారా ఈ జలసంధి మార్గంలో వెళ్లే నౌకలపై ఇరాన్ దాడులు చేయకుండా అడ్డు కుంటామని తాజా చర్యతో అమెరికా చెప్పినట్లుంది. హోర్ముజ్ జల సంధికి యుద్ధ నౌకలను పంపడానికి నాటోతో పాటు మిత్రదేశాలు నిరాకరించాయని అమెరికా అధ్యక్షు డు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సహాయం చేసినప్పటికీ తమకు మద్దతు రావడం లేదని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. తర్వాత కొద్ది గంటల్లోనే ఈ దాడి జరగడం గమనార్హం. ఇదిలా ఉండగా.. అణు ఆయుధాల అభివృద్ధి దిశగా తాము సాగుతున్నామన్న అమెరికా ఆరోపణలను ఇరాన్ ఖండించింది.

తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత అవసరాలకే పరిమితమని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ నెలలుగా ఒత్తిడి తీసుకువస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఈ యుద్ధ నిర్ణయాన్ని ముందుకు నెట్టినట్లు అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే సాధారణంగా బంకర్ బస్టర్ బాంబులను భూగర్భంలో ఉండే లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు వినియోగిస్తారు.

2022 నాటి నివేదికల ప్రకారం.. ఈ బాంబును తయారుచేసేందుకు ఒక్కోదానికి 2.88లక్షల డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.2.6కోట్లు) ఖర్చవుతుందని అంచనా వేశారు. గతేడాది ఇరాన్ అణు కేంద్రాల ను టార్గెట్ చేసుకున్నప్పుడు అమెరికా ఈ బంకర్ బస్టర్లను ప్రయోగించింది. అయితే, నాటి దాడుల్లో 30వేల పౌండ్ల (13,600 కిలోల) బంకర్ బస్టర్ బాంబులను అమెరికా ఉపయోగించింది.