బంగ్లా క్రికెటర్ షకీబ్ ఇంటిపై దాడి
- పెట్రోల్ బాంబులు, రాళ్లతో దాడులు
- షేక్ హసీనా మీటింగ్‌లో పాల్గొనడమే కారణమా?
ఢాకా, ఆగస్టు 6: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై దాడి జరిగింది. పెట్రోల్ బాంబులు, రాళ్లతో దుండగులు దాడులకు పాల్పడ్డారు. మాజీ ప్రధాని షేక్ హసీనా నిర్వహించిన సమావేశంలో షకీబ్ వర్చువల్‌గా పాల్గొనడమే దాడులకు కారణంగా తెలుస్తుంది. బుధవారం అర్ధరాత్రి దాడులు జరిగాయని స్థానిక మీడియా పేర్కొంది. మోటారుసైకిళ్లపై వచ్చిన కొంద రు దుండగులు దాడులు చేశారని, స్థానికులు అప్రమత్తం కావడంతో పరారయ్యా రని, అనంతరం స్థానికులు మంటలను ఆర్పివేశారని తెలిపింది.
గురువారం ఆయన ఇంటివద్ద భారీ బందోబస్తును మోహరించారు. షకీబ్ మాజీప్రధాని షేక్‌హసీనా పార్టీ ‘అవామీ లీగ్’ తరఫున ఎంపీగా గెలిచాడు. ప్రభుత్వం రద్దుకావడంతో ఆయన సభ్యత్వం పోయింది. ఇంకోవైపు హసీనా కుమారుడు సాజీబ్‌వాజెద్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆరోపణలు చేశాడు. భారత్‌కు ఈశాన్యంలో మరో పాకిస్థాన్ తయారైందని విమ ర్శించాడు. బంగ్లాదేశ్ నిర్ణయాల్లో విదేశీ ఇంటలిజెన్స్ జోక్యం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశాడు.






