18 August, 2026 | 1:09 AM

కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల నిలిపివేతకు యత్నాలు

18-08-2026 12:00 AM

మంచిర్యాల క్రైమ్, ఆగస్టు 17 : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల సం క్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను నిలిపివేసే ప్రయత్నాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని, కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని నిలిపివేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల కలెక్టరేట్ కార్యాలయం ముందు మంచిర్యాల కార్పొరేషన్ బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలు పూర్తిగా మరిచిందన్నారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలను నిలిపివేయడమే లక్ష్యంగా సాగుతుందని, అనుకోని ప్రమాదంలో మృతి చెందిన రైతు కుటుంబం కోసం ప్రవేశపెట్టిన రైతుబీమాను నిలిపివేసిన ప్రభుత్వం పేదింటి పెండ్లికి అండగా ఉండే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని నిలిపివేయాలని ప్రయత్నిస్తుందన్నారు. ఈ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 9న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంపై నమోదైన పిటీషన్ కు, ప్రభుత్వం తరఫున అప్పిల్ చేయాలని, చేయని పక్షాన బీఆర్‌ఎస్ తరఫున కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల,

మంత్రుల, ముఖ్యమంత్రి ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ ధర్నా ప్రాంతానికి చేరుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని జిల్లా అదనపు కలెక్టర్ రాములు హామి ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, టీబీజీకేఎస్, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.