calender_icon.png 27 July, 2025 | 11:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంద్రాగస్టు డెడ్‌లైన్

27-07-2025 12:48:00 AM

  1. పెండింగ్ సమస్యలు పరిష్కరించకుంటే సెప్టెంబర్ 1 తర్వాత భవిష్యత్ కార్యాచరణ 
  2. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అల్టిమేటం
  3. సచివాలయ ఆఫీసర్లు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆగ్రహం

హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించింది. తెలంగాణ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకుంటే ఆగస్టు 15 నుంచి ఉద్యమిస్తామని ప్రభుత్వానికి జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావుతోపాటు ఇతర నేత లు అల్టిమేటం జారీ చేశారు.

తమ సమస్యల పరిష్కారం కోసం 17 నెలలుగా వేచి చూశామని.. ప్రభుత్వమిచ్చిన హామీలను పరిష్క రించకుంటే సెప్టెంబర్ 1 తర్వాత ఉద్యోగ జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణకు సిద్ధం కావాల్సి వస్తుందని హెచ్చరించారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లో తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల (టీఈజేఏసీ) జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసి న మీడియా సమావేశంలో మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడారు.

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం గత 17 నెలలుగా ఎదురు చూస్తూ అనేకసార్లు ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో, మంత్రివర్గ ఉపసంఘంతో, అధికారుల కమిటీతో చర్చలు జరిపినప్పటికీ ఉద్యోగుల సమస్యలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు. 

సీఎం ఆదేశాల ప్రకారం పెండింగ్ బిల్లులు నెలకు రూ.700 కోట్లను ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లిస్తామని చెప్పినప్పటికీ గత నెలలో కేవలం రూ.183 కోట్ల మెడికల్ బిల్లులను  చెల్లించారు తప్ప మిగిలిన గత నెల.. ఈ నెల కలిపి మొత్తం రూ.1217 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఉద్యోగులు తీవ్ర బాధలో ఉన్నారని, మా బాధలు పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కావాలంటే ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్టులు తెప్పించుకోవాలని, తమ సమస్యలపై గతంలో ఇచ్చిన నివేదికలపై మంత్రులు, అధికారులు రివ్యూలు చేసి వాటిని పరిష్కరించాలని కోరారు. 

అధికారులు సమయమివ్వడంలేదు..

ఉన్నతాధికారులు తమకు సమయమివ్వడంలేదని జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తామిచ్చిన 57 డిమాండ్లలో ఎన్ని పరిష్కరించారో అధికారుల కమి టీ బయట పెట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. బకాయిలు ఇప్ప టివరకు చెల్లించకుండా తాత్సారం చేస్తున్న ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి.. ఉద్యోగుల గోడును పెడచెవిన పెట్టడాన్ని తీవ్రంగా ఖం డించారు.

ఈహెచ్‌ఎస్ (ఉద్యోగుల ఆరోగ్య కార్డు పథకం)ను ప్రారంభిస్తామని ప్రభు త్వం హామీ ఇచ్చినప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ఈహెచ్‌ఎస్ అమలుకు మోకాలు అడ్డుపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే, బకాయి పడ్డ 5 డీఏలు అడిగితే కేవలం ఒక్క డీఏ మా త్రమే ఇచ్చి చేతులు దులుపుకోవడంలో ఆర్థి క శాఖ అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు.

పీఆర్సీని జాప్యం చేస్తున్నారు..

పీఆర్సీ జాప్యానికి కమిషన్ చైర్మన్ శివశంకరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సె ప్టెంబర్ 1 తర్వాత చేపట్టే కార్యాచరణకు అధికారులే కారణమవుతారని స్పష్టం చేశారు. అ లాగే 2023, జూలై 1 నుంచి అమలు చేయాల్సిన నూతన వేతన సవరణ మాటను ఇప్ప టి వరకు ఎత్తకపోవడం బాధాకరమన్నారు.

సీఎంతోపాటు, మంత్రిమండలి సభ్యుల ఆదేశాలను గౌరవించాల్సిన అధికారులు.. ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారా అనే అనుమానం కలగకుండా ఉండాలంటే సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. సమావేశంలో పుల్గం దామోదర్‌రెడ్డి, వంగా రవీందర్‌రెడ్డి, జీ సదానందంగౌడ్, మధుసూదన్‌రెడ్డి, కటకం రమేశ్ పాల్గొన్నారు. 

జేఏసీ ప్రధాన సమస్యలు ఇవి..

* క్యాబినెట్ సమావేశంలో ఆమోదించిన విధంగా నెలకు రూ.700 కోట్ల పెండింగ్ బిల్లులు క్రమం తప్పకుండా చెల్లించాలి. గత నెల రూ.517 కోట్లు, ఈనెల రూ.700 కోట్లు మొత్తం రూ.1,217 కోట్ల బకాయిలను ఈనెలలోనే చెల్లించాలి.

* ఆరోగ్య రక్షణ పథకాన్ని (ఈహెచ్‌ఎస్) జూలై నెల చివరిలోపే పూర్తిస్థాయిలో నిబంధనలను రూపొందించి అమలు చేయాలి.

* పెండింగ్‌లో ఉన్న ఐదు కరువు భత్యా (డీఏ)లను తక్షణమే విడుదల చేయాలి.

* కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి.

* ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయడానికి తక్షణమే అధికారులకు ఆదేశా లు జారీ చేయాలి.

* 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 57 మె మో ద్వారా పాత పెన్షన్ అమలు చేయాలి.

* పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని 51 శాతం ఫిట్‌మెంట్ అమలు చేయాలి.

* వివిధ కారణాలతో సస్పెండయిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి.

* గచ్చిబౌలి స్థలాలను భాగ్యనగర్ టీఎన్జీవోలకు కేటాయించాలి.

* స్థానికత ప్రాతిపదికగా అదనపు పోస్టులను సృష్టించి జీవో 317 బాధితులకు న్యాయం చేయాలి.

* రాష్ర్ట ప్రభుత్వ శాఖల్లో పదోన్నతుల కమిటీలను సకాలంలో ఏర్పాటు చేసి ప్రమోషన్లు ఇవ్వాలి. అలాగే మిగతా పెండింగ్ సమస్యలనింటిని వెంటనే పరిష్కరించాలి.

* నూతనంగా ఏర్పడిన మండలాలకు ఎంఈవో పోస్టులను మంజూరు చేయాలి.

* సమగ్రశిక్ష ఉద్యోగుల 29 రోజుల సమ్మె కాలపు వేతనాన్ని మంజూరు చేయాలి.

* సెప్టెంబర్ 1ని పెన్షన్ విద్రోహ దినం గా పాటిస్తూ నిరసన కార్యక్రమాలు జిల్లా కేంద్రాల్లో జరుపుతాం.