calender_icon.png 27 July, 2025 | 9:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబ్బులకు క్లబ్బులు!

27-07-2025 12:43:37 AM

  1. ప్రభుత్వ పరిధిలో ఉండాల్సిన క్రికెట్ క్లబ్‌లు ప్రైవేట్ పరం
  2. హెచ్‌సీఏ జాబితా నుంచి అదృశ్యమైన 21 క్లబ్బులు
  3. ఒక్కో క్లబ్బు రూ.2 కోట్లకు అమ్ముకున్నట్టు ఆరోపణలు

హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): అక్రమాలకు అక్షయపాత్రలా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) మారింది. తవ్వుతున్న కొద్దీ కోకొల్లలుగా అవినీతి, అక్రమాలు బయటపడుతున్నాయి. టికెట్ల విక్రయాల్లో అవినీతి, ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా ఎన్నికల్లో పాల్గొనడం, అడ్డదారిలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా జగన్ మోహన్‌రావు గెలుపొందడం వంటివి ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి.

అయి తే తాజాగా హెచ్‌సీఏ పరిధిలోని కొన్ని క్లబ్బులు చేతులు మారిన ఉదంతం బయటపడింది. వాస్తవానికి హైదరాబాద్ క్రికెట్ లీగ్ కూడా ముంబైలోని కంగా క్రికెట్ లీగ్‌తో సమానంగా పేరు ప్రఖ్యాతలను సంపాందించుకుంది. కానీ ప్రస్తుతం బోర్డులో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాల కారణంగా రోజురోజుకూ ప్రతిష్ఠ దిగజారిపోతోంది.

తరుచూ మ్యాచులు లేకపోవడం, అనేక సంస్థాగత క్లబ్బులు ప్రైవేట్ పరం కావడంతో యథేచ్ఛగా నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. క్రికెట్ ఆట ద్వారా ఆర్థికంగా మెరుగుపడటం, ఐపీఎల్ వంటి లీగ్ రావడం, అవినీతి, ఏకపక్ష నిర్ణయాలు, పాలకుల ప్రమేయం కారణంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కుంభకోణాల కేంద్రంగా మారింది.

కోట్లల్లో కుంభకోణం..

హెచ్‌సీఏ పరిధిలోని 216 క్లబ్బుల్లో కొన్ని ప్రభుత్వరంగ సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతాయి. సాధారణంగా ఈ క్లబ్బులకు ప్ర భుత్వ అధికారులు ప్రతినిధులుగా ఉంటా రు. ఈ క్రమంలో క్రికెట్ ఆటతో సంబంధం లేని వారే ప్రతినిధులుగా కొనసాగుతారు. కానీ ప్రస్తుతం ఈరకమైన చాలా క్లబ్బులు ప్రైవేట్‌పరం అయ్యాయి.

ఆయా క్లబ్బుల ప్రతినిధులుగా ఉన్న అధికారులు హెచ్‌సీఏ సభ్యులతో చేతులు కలిపి ప్రభుత్వరంగ సం స్థల ఆధ్వర్యంలో కొనసాగాల్సిన క్లబ్బులను ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్నారని టీసీఏ ఆధారాలతో సహా ఆరోపిస్తోంది. ఒక్కో క్లబ్బును రూ.2కోట్లకు అమ్ముకుని కోట్లాది రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు.

అయితే ప్రభుత్వపరిధిలో ఉండాల్సిన 21 క్లబ్బులు ప్రస్తుతం హెచ్‌సీఏ జాబితాలో లేవు. ఒక్కో క్లబ్బు రెండు కోట్ల చొప్పున మొత్తం 21 క్లబ్బులను రూ.42కోట్లకు విక్రయించారని టీసీఏ(తెలంగాణ క్రికె ట్ అసోసియేషన్) ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వంలోని పెద్దల అండతోనే హెచ్‌సీఏ బోర్డు అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

సంస్థాగత క్లబ్బుల్లో కొత్త నియామకాల్లేవు: గురువారెడ్డి, టీసీఏ, ప్రధాన కార్యదర్శి

సంస్థాగత క్లబ్బుల తరఫున లీగ్‌ల్లో పాల్గొనడానికి కొత్త నియామకాలు లేకపోవడమే ప్రధాన కారణం. రెండు దశాబ్దాలుగా బ్యాం కులు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో  క్రీడా నియామకాలు జరగలేదు. ఆటగాళ్లు కూడా వయ సు మీరి పోతుండటంతో మ్యాచులకు హాజరుకాలేకపోతున్నారు. పాత ఆటగాళ్లు అందు బాటులో ఉండరు.

కొత్త నియామకాలు జరగవు. ఈ క్రమంలో హెచ్‌సీఏ సంస్థాగత క్లబ్బుల పేరిట అక్రమాలకు పాల్పడుతోంది. నిబంధనలకు విరుద్ధంగా క్లబ్బులను ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటోంది. అయితే హెచ్‌సీఏ పరిధిలోని ఇనిస్టిట్యూషన్ క్లబ్బుల అదృ శ్యం వెనుక ఉన్న వారిని సీఐడీ విచారించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలి. 

ప్రైవేట్ పరమైన క్లబ్బులు

1. హెచ్‌ఎంటీ బేరింగ్స్ 2. ఐడీపీఎల్ 3. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ 4. ప్రాగాటూల్స్ 5. ప్రొవియెంట్ ఫండ్ 6. టెలికాం 7. జోరాస్ ట్రైన్ క్లబ్ 8. ఫైన్ క్యాబ్ 9. విమ్‌కో 10. హెచ్‌సీఎల్ 11. పీహెచ్‌పీ సిమెంట్ 12. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 13. హైదరాబాద్ బాట్లింగ్ 14. వైఎంఆర్‌సీ 15. హుడా 16. ఈఎంఈ రికా ర్డ్స్  (ఆర్మీ) 17. ఎస్‌బీహెచ్(స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్) 18. హైదరాబాద్ టెలిఫోన్స్ 19. హిందూస్థాన్ కేబుల్స్ 20. విజయ్ భారత్ 21. ఆంధ్రాబ్యాంక్ బ్యాంకు