21-02-2026 12:50:19 AM
సంవత్సరాలు గడుస్తున్న మారని రోడ్లు
ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోని అధికారులు
మరమ్మత్తులు చేయించాలని ప్రజల వేడుకోలు
తుంగతుర్తి, ఫిబ్రవరి 20 : సంవత్సరాలు గడుస్తున్న.. ప్రభుత్వాలు మారుతున్న, అధికారులు వస్తూ వెళ్తున్నప్పటికీ గ్రామాల్లో రోడ్ల మరమ్మత్తులకు ప్రత్యేక నిధులు మంజూరు కాకపోవడంతో వాహనదారులు, ప్రజలు కష్టాలు చవిచూస్తున్నారు. ఇది ఒకటి, రెండు నెలలు అయితే అర్థం చేసుకోవచ్చు, కానీ సంవత్సరాల తరబడి చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీంతో గతుకుల రోడ్ల గండమెన్నాళ్లు అంటూ వాహనదారులు తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు
ప్రమాదకరంగా మారిన రోడ్లు
జిల్లా నాగారం మండల పరిధిలోని పస్తాల గ్రామానికి వెళ్లే రోడ్డు, పసునూరు స్టేజి నుండి ఊరికి వెళ్లే రోడ్డు, తుంగతుర్తి మండల కేంద్రం నుండి రావులపల్లి ఎక్స్ రోడ్ వరకు వెళ్లే రహదారులు ,ప్రస్తుతం ప్రమాదకరంగా మారి, వాహనదారులు పడుతూ లేస్తూ, గాయాల పాలవుతున్నారు. పస్తల అడ్డరోడ్డు నుండి గ్రామానికి వెళ్లే రోడ్డు, గత ప్రభుత్వంలో నిధులు మంజూరు అయ్యాయని చెబుతూ, నేటి వరకు కూడా నిధులు రాకపోవడం, దీనితో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు చందంగా మారింది.
ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచ్ ఎన్నికలు వచ్చినప్పుడు గ్రామ ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు, నీటి బుడగల్లాగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనితో పాఠశాలకు వెళ్లే చిన్నారులు సైతం రోడ్డుకు నిధులు కేటాయించాలని కోరుతూ ధర్నా చేశారు. దీనితో గత రెండు రోజుల క్రితం పంచాయతీరాజ్ శాఖ నుండి నూతన బీటీ రోడ్డు నిర్మాణం కోసం కోటి రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటన రావడంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నిధులు రాక నిలిచిన పనులు
తుంగతుర్తి నుండి రావులపల్లి ఎక్స్ రోడ్డు వరకు 13 కోట్ల రూపాయలతో, డబుల్ రోడ్డు వేయాల్సి ఉండగా, కొద్దిపాటి పనులు చేసి, సదరు కాంట్రాక్టర్ కు ప్రభుత్వంనిధులు మంజూరు చేయకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిపివేశారు. ఈ రోడ్డుపై కూడా రాత్రి వేళలో ప్రమాదాలు జరుగుతున్నాయి. కొత్తగూడెం ఊరు నుండి గోరంట్ల వెళ్లే మార్గం కూడా దీనస్థితిలో ఉన్నది. నియోజకవర్గంలోని పలు మండలాల్లోని గ్రామాల్లో ప్రస్తుతం రోడ్లకు మరమ్మత్తులు చేయాలంటే, ప్రత్యేకంగా కోట్ల రూపాయలు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి, రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలని, వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.
కంకర తేలిన రోడ్డుతో ఇబ్బందులు పడుతున్నాము
గడచిన పది సంవత్సరాల కాలం నుండి కొత్తగూడెం ఊరికి వచ్చే రోడ్డు, కొత్తగూడెం నుండి గోరంట్లకు వెళ్లే రోడ్డు పెద్ద, పెద్ద గుంతలు పడి కంకర తేలి ఉండడంతో బైకులపై వెళ్లాలంటే చాలా కష్టంగా మారింది. ఇక వర్షాకాలంలో, రాత్రి వేళలో ప్రయాణించాలంటే అవస్థలు తప్పడం లేదు. ఇదే రోడ్డుపై ఇటీవల ఓ ప్రయాణికుడు కింద పడి గాయాలపాలై, మృత్యువాత పదిన సందర్భం కూడా ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయించి ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా చూడాలి.
సింహాద్రి యాదవ్, వాహన దారుడు, కొత్తగూడెం
పస్తాల రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి
గడచిన పది సంవత్సరాలుగా రోడ్డు మరమ్మత్తులు చేయకపోవడంతో ప్రయాణానికి తిప్పలు తప్పలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో ఎమ్మెల్యే మందుల సామేలు, ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో, పంచాయతీరాజ్ శాఖ ద్వారా కోటి రూపాయలు నిధులు మంజూరు అయ్యాయి. అధికారులు తక్షణమే టెండర్లు పిలిచి, యుద్ధ ప్రాతిపదికన నూతన రోడ్డు ఏర్పాటు చేయాలి.
బుక్కా శ్రీనివాస్. సర్పంచ్ పస్తాల