06-01-2026 01:21:26 AM
హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): యువభారతి సాహితీ సాంస్కృతిక సంస్థ, ఐఐఎంసి కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ‘తెలుగు వెలుగు సమాఖ్య కార్యక్రమం’ 16వ సమావేశం రంగయ్య నీలావతి ఫౌండేషన్ సంస్థతో కలిసి లకిడికాపూల్‌లోని ఐఐఎంసి కళాశాల సభా ప్రాంగణంలో నిర్వహించారు. తెలుగు సాహిత్యానికి చేసిన సేవకుగాను గుర్తుగా సాహితీవేత్త ఆచార్య కసిరెడ్డి వెంకట్‌రెడ్డికి రంగయ్య నీలావతి ఫౌండేషన్ మొదటి పురస్కారాన్ని అందజేశారు. పురస్కారంతో పాటు రూ.10 వేల నగదు, సన్మాన పత్రాన్ని అందజేశారు. యువ సాహిత్య పరిశోధకుడు, గేయ రచయిత నిజాం కళాశాల సహయాచార్యులు డా.తిరునగరి శరత్ చంద్ర కసిరెడ్డి జీవిత విశేషాలతో కూడిన సన్మాన పత్రాన్ని చదివి వినిపించారు.
అనంతరం పురస్కార గ్రహీత ఆచార్య కసిరెడ్డి ‘సాహిత్యం ద్వారా సంస్కారాలు- విలువలు’ అనే అంశంపై విద్యార్థులనుద్దేశించి ఉపన్యసించారు. కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు ఇ రామకృష్ణ తెలుగు భాషా సాహిత్యాలను వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో తెలుగు వెలుగు కార్యక్రమాలు యువభారతితో కలిసి నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆచార్య వంగపల్లి విశ్వనాథం సభాధ్యక్ష వహించారు. ఐఐఎంసి కళాశాల సెప్టెంబర్ 10న ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సాహితీమూర్తుల సాహిత్య సమాలోచన జాతీయ సదస్సు ప్రత్యేక సంచికను ఆచార్య కసిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆవిష్కరించారు.
యువభారతి ఉపాధ్యక్షులు డా.జి.ఎల్.కె. దుర్గ మాట్లాడుతూ పుట్టిన ప్రతి మనిషి జీవితంలో ఎన్నో మంచి విషయాలను నేర్చుకొని ఆచరించాలని తెలిపారు. తెలుగు సాహిత్యంలోని శతక పద్యాలలోని మాధుర్యాన్ని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ పూర్వాధ్యక్షులు ఆయాచితం శ్రీధర్ విశ్లేషించారు. కళాశాలలో మొత్తం 1500 మంది విద్యార్థులు వివిధ కోర్సులలో చదువుతూ వారి ప్రతిభతో కళాశాల ఏ+ గ్రేడ్ సాధించిందని, ఐఎస్‌వో సర్టిఫికెట్ కూడా పొందిందని ప్రిన్సిపల్ కూర రఘువీర్ తెలిపారు. తెలుగు భాషా వ్యాప్తికై రూపొందించిన తెలుగు వెలుగు కార్యక్రమంలో తమ సంస్థ భాగస్వామ్యం కావడం ఆనందాన్నిస్తుందని రంగయ్య నీలావతి ఫౌండేషన్ కార్యదర్శి ఐ. మురళి తెలియజేశారు. కార్యక్రమంలో యువభారతి సభ్యులు ఆమాతి రవీంద్ర, నారాయణ రెడ్డి పాల్గొన్నారు.