4 August, 2026 | 4:16 PM

భూ భారతి పోర్టల్‌పై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలి

04-08-2026 03:03 PM

కలెక్టర్ కె. హరిత

ఆసిఫాబాద్(విజయక్రాంతి): రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్లు భూ భారతి పోర్టల్‌లోని ప్రతి అంశంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ కె. హరిత సూచించారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భూ భారతి పోర్టల్ శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జూనియర్ అసిస్టెంట్లు కేవలం తహసీల్దార్ కార్యాలయ బాధ్యతలకే పరిమితం కాకుండా భూ భారతి పోర్టల్‌లోని అన్ని సేవలు, దరఖాస్తులు, భూ సేకరణ తదితర అంశాలపై నైపుణ్యం సాధించాలని అన్నారు.

పోర్టల్ ఆపరేటర్‌పై మాత్రమే ఆధారపడకుండా స్వయంగా పనులు నిర్వహించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భూ భారతి కోఆర్డినేటర్ రాము, రవికాంత్, జిలాని, వివిధ మండలాల జూనియర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.