పబ్బతి ఆంజనేయస్వామిని దర్శించుకున్న కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
అచ్చంపేట: నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని పదర మండలం మద్దిమడుగు గ్రామంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మంగళవారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కలెక్టర్‌కు ప్రధాన అర్చకులు వీరయ్య పూర్ణకుంభంతో, వేదమంత్రోచ్ఛారణల మధ్య సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రజలు సుఖశాంతులతో జీవించాలని, రైతులకు సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, యువత విద్య, ఉపాధి రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని, జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని స్వామివారిని కలెక్టర్ ప్రార్థించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వీరయ్య దేవాలయ చరిత్ర, ఆధ్యాత్మిక విశిష్టత, పురాతన వైభవం, నిత్య పూజలు, వార్షిక ఉత్సవాల ప్రాధాన్యాన్ని కలెక్టర్‌కు వివరించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తారని తెలిపారు.
వేద పండితులు వేదాశీర్వచనాలతో కలెక్టర్‌ను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. కలెక్టర్ ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పరిశుభ్రత, మౌలిక వసతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కను నాటారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర, ఎంపీడీవో సుధాకర్, స్థానిక ఎస్సై, వివిధ శాఖల అధికారులు, ఆలయ అర్చకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.






