6 August, 2026 | 3:25 AM

సైబర్ క్రైమ్,సెక్యూరిటీపై అవగాహన

06-08-2026 01:56 AM

కొత్తపల్లి, ఆగస్ట్ 5(విజయక్రాంతి):కరీంనగర్ రూరల్ మండలంలోని ఇరుకుల్ల గ్రామంలో ఉన్న మైనారిటీ పాఠశాల విద్యార్థులకు కరీంనగర్ రూరల్ సిఐ ఆధ్వర్యంలో రూరల్ పోలిసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ అవగాహన కార్యక్రమంలో విద్యార్థులకు సైబర్ క్రైమ్, సైబర్ సెక్యూరిటీ, డ్రగ్స్, గంజా తదితర మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతపై విపులంగా సిఐ నిరంజన్ రెడ్డి అవగాహన కల్పించారు.

సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ పంచుకోవద్దని, తెలియని లింకులు, సందేశాలను నమ్మవద్దని సూచించారు.అలాగే విద్యార్థులు అవసరం లేని విధంగా మొబైల్ ఫోన్ల వినియోగానికి దూరంగా ఉండాలని, ఎటువంటి దురలవాట్లకు బానిసలు కాకుండా విద్యపై దృష్టి సారించాలని, చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని సూచించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక నష్టాల గురించి వివరించారు.

అదే విధంగా కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్కు చెందిన మహిళా కానిస్టేబుల్ శ్రీమతి కీర్తన విద్యార్థులకు సైబర్ సెక్యూరిటీ, ముఖ్యంగా బాలికలు పాటించాల్సిన ఆన్లైన్ భద్రతా సూచనలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.