22-01-2026 03:19:42 PM
బెల్లంపల్లి,జనవరి 22(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2026-27 విద్య సంవత్సరానికి 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు ప్రవేశాలకు తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టిజిసెట్ ) దరఖాస్తులను ఈనెల 25వ తేదీ వరకు పొడిగించినట్లుగా కాసిపేట గురుకుల ప్రిన్సిపాల్ వూటూరి సంతోష్ కుమార్ తెలిపారు. గురువారం పెద్దబూధ ,చిన్న బూధ గ్రామపంచాయతీలో టీజీ సెట్ దరఖాస్తుల పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 25వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఫీజు రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 22న జరుగుతుంది.
21వ శతాబ్దం గురుకులాల్లో నాణ్యమైన విద్యతోపాటు ఉచిత దుస్తులు, పుస్తకాలు, సన్న బియ్యంతో కూడిన పోషకమైన ,రుచికరమైన సమతుల్య ఆహారం,హాస్టల్ సౌకర్యం, నెలవారి కాస్మెటిక్ చార్జీలు బ్యాంకుల ద్వారా వస్తున్నాయని తెలిపారు. విద్య విషయక అంశాలతో పాటు సమానంగా సహా పాఠ్య కార్యకలాపాలు ఆటలు ,క్రీడలు, కోడింగ్ ,లలిత కళలు, గ్రంధాలయ సౌకర్యం మొదలైన వాటిపై ప్రత్యేక దృష్టి ఉంటుందన్నారు. క్రీడల్లో విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించి శిక్షణ ఇస్తారనీ తెలిపారు. గురుకులాల్లో సమర్థవంతమైన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధన, నిరంతర పర్యవేక్షణ, ప్రత్యేక తరగతులు నిర్వహిన్నారన్నారు. అన్ని ప్రభుత్వ పరీక్షల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం ఫలితాలు సాధిసున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న బూధ గ్రామ సర్పంచ్ ఎంబడి రాణి, పెద్ద బూధ పంచాయతీ కార్యదర్శి ఎం హరికృష్ణ, కాసిపేట గురుకుల ఉపాధ్యాయులు, గ్రామంలోని పాఠశాల విద్యార్థులు , ప్రజలు పాల్గొన్నారు.