22-01-2026 03:46:13 PM
గిరిజనుల అభివృద్ధికి ఇందిరా సౌర గిరిజన వికాసం
విద్యుత్ సమస్యల పరిష్కారానికి పొలం బాట, ప్రజల బాట
పివిటిజి గిరిజనులందరికి ఇందిరమ్మ ఇల్లు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
కుమ్రం భీంఆసిఫాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం రావాలని అది వచ్చేవరకు విశ్రమించమని పీపుల్స్ మార్చ్ లో తనతో పాటు అనేకమంది నడిచారు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి రాగానే మళ్లీ రావాలని మీరంతా దీవించి పంపారు, మీరంతా చెప్పినట్టే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీ సమస్యలు తీరుస్తుంది, మీరు కోరుకున్నట్టే కృతజ్ఞతలు తెలవడానికి తాను వచ్చానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఈ క్రమంలో గురువారం ఆసిఫాబాద్ జిల్లా జైనురు మండలం జాంగాం క్రమంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. తెచ్చుకున్న రాష్ట్రంలో స్వేచ్ఛ పోయింది, ఈ ప్రాంత సంపద ఇక్కడి ప్రజలకు చెందాలని ఆనాడు మీరు కోరారు .మీరు కోరిన విధంగానే ప్రజా ప్రభుత్వంలో పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం, అభివృద్ధి సంక్షేమ పథకాలకు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. పీపుల్ స్పార్ట్స్ పాదయాత్ర లో భాగంగా ఆనాడు ప్రతిరోజు నన్ను కలిసిన వారిని, వారు విజ్ఞప్తి చేసిన సమస్యలను వివరంగా రాసుకున్నాను. బడ్జెట్లో ఆయా అంశాల పరిష్కారానికి నిధులు కేటాయిస్తున్నానని తెలిపారు.
2023 మార్చిలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయంలో గిరిజనులు అటవీ భూముల హక్కులు, సాగు సమస్యలను వివరించారు ప్రజా ప్రభుత్వం వచ్చాక గిరిజనుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వారికోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇందిరా సౌర గిరిజల వికాసం అనే పథకాన్ని తీసుకువచ్చామని డిప్యూటీ సీఎం తెలిపారు. 20 23 మార్చిలో ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి పాదయాత్ర ప్రారంభించి ఖమ్మంలో ముగించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సమయంలో ఆయనకు ప్రజలు చేసిన విజ్ఞప్తులు, సమస్యలను ప్రజా ప్రభుత్వం వచ్చాక పెద్ద సంఖ్యలో పరిష్కరించారు. ఈ నేపథ్యంలో నాడు పాదయాత్ర సమయంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు వాటి పరిష్కారం ఇంకా మిగిలిపోయిన సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
అటవీ హక్కుల చట్టం కింద గిరిజనులు సాగు చేసుకునేందుకు వారికి పట్టాలు ఇచ్చాం, ఆ భూములు సాగు చేసుకునేందుకు విద్యుత్ సరఫరా విషయంలో అటవీ శాఖ అధికారులతో ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఇందిరా సౌర గిరి జలవికాసం పథకాన్ని తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ పథకంలో ప్రభుత్వమే బోరు వేయించి సోలార్ పవర్ ద్వారా విద్యుత్ సదుపాయం, డ్రిప్పు, ఆర్థికంగా లాభపడేందుకు పామ్ ఆయిల్, అవకాడో వంటి మొక్కలు పూర్తిగా ఉచితంగా ప్రభుత్వమే అందిస్తుందని తెలిపారు. ఇప్పటికే ఈ పథకాన్ని నల్లమల్ల అటవీ ప్రాంతంలో ప్రారంభించామని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి మా ప్రభుత్వం రాగానే ధరణి చట్టాన్ని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాము చెప్పినట్టుగానే ధరణి స్థానంలో భూభారతి కొత్త చట్టాన్ని తీసుకువచ్చామని తెలిపారు.
తన పాదయాత్ర సందర్భంగా విద్యుత్ సమస్యలను గిరిజనులు వివరించిన విషయం తనకు గుర్తుందని అదృష్టవశాత్తు ప్రియతమ నేత రాహుల్ గాంధీ ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే తనకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు విద్యుత్ శాఖ సైతం అప్పగించారని తెలిపారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు వారానికి రెండు రోజులు పొలం బాట, ప్రజల బాట పడుతున్నారని అధికారులే మీ వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు. ఏమైనా విద్యుత్ సమస్యలు ఉంటే అనారోగ్య సమస్యలు ఎదురైతే ఫోన్ చేయగానే 108 ఎలా వస్తుందో కరెంటు సమస్య ఉన్నవారు 1912 నెంబర్ కు కాల్ చేస్తే విద్యుత్ అధికారులే మీ వద్దకు వచ్చి 24 గంటల్లో ఒక వాహనంలో వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. పివిటిజి గిరిజన అందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు ఎంత తొందరగా కట్టుకుంటే అంత ఉపయోగం మీరు ఎంత వేగంగా కట్టుకుంటే అంత వేగంగా ప్రభుత్వం విలువ తెలుస్తుంది అని తెలిపారు. ఐదు సంవత్సరాల వ్యవధిలో మహిళా సంఘాలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందించి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతాం అన్నారు. మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించడమే కాదు మహిళల చేత బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి లీజుకు ఇప్పిస్తున్నామని వివరించారు.
పాదయాత్ర సమయంలో విద్యా వ్యవస్థ బాగాలేదని విన్నవించారు అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ సభ్యులు ఆలోచించి పేద బిడ్డలకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మిస్తున్నమని తెలిపారు. మన బిడ్డలు ప్రపంచంతో పోటీపడేలా ఒక్కో పాఠశాలను 25 ఎకరాల్లో 200 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామని రాష్ట్రంలో ఒకేసారి వంద పాఠశాలల నిర్మాణానికి అనుమతులు ఇచ్చినట్టు తెలిపారు. ఉట్నూరు ఆసిఫాబాద్ రహదారి వెడల్పుకు పాదయాత్ర సమయంలో విజ్ఞప్తి చేశారు మీ అందరి కోరిక మేరకు ఆ పనిని మంజూరు చేసి హమ్ పథకంలో రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలవబోతున్నట్లు తెలిపారు.
ఉట్నూరు కరిమెరి రోడ్డు వెడల్పు, అనార్పల్లి వంతెన నిర్మాణం కోసం అడిగారు వాటిని మంజూరు చేసినట్టు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓజా తెగ తయారు చేసే హస్తకళల వస్తువులను ఉమ్మడి రాష్ట్రంలో ఐటీడీఏ ద్వారా మార్కెటింగ్ చేసేవారు గత పది సంవత్సరాలు పట్టించుకోలేదని విజ్ఞప్తి చేశారు. మీ విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రభుత్వం రాగానే మీ వృత్తిని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ప్రభుత్వం గుర్తించిందని, చేతి పనిముట్లకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్,ట్రై కార్ రాష్ట్ర చైర్మన్ బెల్లయ్య నాయక్,జిసిసి చైర్మన్ కోట్నాక తిరుపతి,ఎంపీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి ,జిల్లా కలెక్టర్ కె.హరిత,జిల్లా ఎస్పి నితిక పంత్ ,డీఎఫ్ఓ నీరజ్ కుమార్ ,అదనపు కలెక్టర్ దీపక్ తివారి,ఏ ఎస్ పి చిత్తరంజన్,ఏఎంసీ చైర్మన్ విశ్వనాథ్,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆత్రం సుగుణ,మాజీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ రావు,నియోజకవర్గ ఇన్చార్జ్ అజ్మీరా శ్యాం నాయక్,మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు తదితరులు పాల్గొన్నారు.