22-01-2026 03:42:49 PM
హైదరాబాద్: ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అన్నారు. బేగంపేటలో పౌర సరఫరాల శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన 2025-26 ఖరీఫ్ సీజన్ వరి ధాన్యం కొనుగోలుపై సమీక్షించారు. కొనుగోలు ప్రక్రియ ద్వారా 14.2 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని, వారికి సంబంధించిన రూ. 18,444 కోట్ల చెల్లింపులు నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయబడ్డాయని మంత్రి తెలిపారు. 25 ఏళ్లలో ఎప్పుడూ లేనంత ధాన్యం ఉత్పత్తి సాధించామని పేర్కొన్నారు.
సజావుగా కొనుగోలు ప్రక్రియను నిర్వహించి, రైతులకు సకాలంలో చెల్లింపులు అందేలా చూసిన అధికారుల కృషిని ఆయన ప్రశంసించారు. 2025 సీజన్ లో 71.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. ప్రతికూల పరిస్థితులు ఉన్నా.. ధాన్యం సేకరణ విజయవంతం చేశామన్నారు. లీగల్ ఎన్ ఫోర్స్ మెంట్ మార్గదర్శకాలను మంత్రి విడుదల చేశారు. ఈ సమీక్షా సమావేశానికి పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి స్టీఫెన్ రవీంద్ర, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. సాధించిన విజయాలపై స్టీఫెన్ రవీంద్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.