22-01-2026 04:32:52 PM
నేను రెండుసార్లు వచ్చాను, మీరు నాకు భోజనం పెట్టారు, నాతో పాదయాత్రలో నడిచారు
గంగుబాయితో ఆవిడ గ్రామంలో ముఖాముఖి నిర్వహించిన డిప్యూటీ సీఎం
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా సీఎల్పీ నేతగా నాడు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka ) పీపుల్ స్పాట్స్ పేరిట పాదయాత్ర చేశారు. ఆ క్రమంలో అనేక గ్రామాలు తిరిగారు. గ్రామస్తులతో కూర్చొని మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు, పాదయాత్ర సందర్భంగా ఆయా గ్రామస్తులు భట్టి విక్రమార్కతో అడుగులో అడుగు వేశారు. ప్రజా ప్రభుత్వం వస్తుంది మళ్లీ రావాలని నాడు దీవించి పంపారు. వారి దీవెనలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
ప్రజల విజ్ఞప్తులను ప్రత్యేకంగా నమోదు చేసుకున్న డిప్యూటీ సీఎం వాటిని దాదాపు పరిష్కరించారు. ఈ నేపథ్యంలో కృతజ్ఞతలు తెలిపేందుకు తిరిగి తాను పాదయాత్ర ప్రారంభించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా తాను పాదయాత్ర చేస్తున్న క్రమంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం దేవుగూడ గూడెంలోలక్ష్మీబాయి, గంగు భాయ్ తనకు ఆనాడు భోజనం పెట్టడమే కాదు, తనతో పాటు కొన్ని కిలోమీటర్ల మేర నడిచారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తిరిగి ఆ గూడానికి వెళ్లారు. వారందరినీ పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని నాటి ఫోటోలు చూపిస్తూ ఆనాటి విషయాలను గుర్తు చేశారు. తాను కూర్చున్నది, వారు చెప్పిన సమస్యల గురించి ప్రస్తావించారు. ఇళ్ల సమస్య, డ్రైనేజీ వాటర్ సమస్య, పట్టాదారు పాస్ పుస్తకాల సమస్యలను, విద్యుత్ పరిష్కరించారు.
ఈ నేపథ్యంలో జిల్లా అధికారులతో కలిసి ఆయన గూడెం గ్రామస్తులతో భేటీ అయ్యారు ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో అంగన్వాడి కేంద్రం, ప్రభుత్వ పాఠశాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని, పిఎసిఎస్ సబ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆరోజు పాదయాత్రలో నాకు గంగుబాయి, లక్ష్మీ భాయ్ ఇద్దరు భోజనం పెట్టారు నా చేతిలో చేయి వేసి కొన్ని కిలోమీటర్లు నడిచారు, ప్రభుత్వం వస్తుందని ఆశీర్వదించి పంపారు. వారు ఆశీర్వదించినట్టుగా ప్రజా ప్రభుత్వం వచ్చింది వారిద్దరిని హైదరాబాదులో నేను ఉంటున్న ప్రజాభవన్ కు భోజనానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వారు హైదరాబాద్ కు వచ్చేందుకు, తిరిగి వెళ్లేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్,ట్రై కార్ రాష్ట్ర చైర్మన్ బెల్లయ్య నాయక్,జిసిసి చైర్మన్ కోట్నాక తిరుపతి,ఎంపీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి ,జిల్లా కలెక్టర్ కె.హరిత,జిల్లా ఎస్పి నితిక పంత్ ,డీఎఫ్ఓ నీరజ్ కుమార్ ,అదనపు కలెక్టర్ దీపక్ తివారి,ఏ ఎస్ పి చిత్తరంజన్,ఏఎంసీ చైర్మన్ ఇరుకుల్లా మంగ,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆత్రం సుగుణ,మాజీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ రావు,నియోజకవర్గ ఇన్చార్జ్ అజ్మీరా శ్యాం నాయక్,మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు తదితరులు పాల్గొన్నారు.