calender_icon.png 30 January, 2026 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఆర్‌పై అవగాహన అవసరం

27-01-2026 12:00:00 AM

ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో కార్డియక్ అరెస్ట్, హార్ట్‌ఎటాక్ సాధారణ విషయమైంది. వయస్సుతో సంబంధం లేకుండా ఎక్కువ మంది వాటి బారిన పడుతున్నారు. కొందరు గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో (కార్డియో పల్మనరీ రిసస్సిటేషన్) గురించి ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఉన్నట్టుండి కార్డియక్ అరెస్ట్‌కు గురై కుప్పకూలి పడిపోతే వారికి తక్షణం సీపీఆర్ చేసి కాపాడవచ్చు.

ఆ అటాక్ నుంచి తర్వాత గంట సమయాన్ని గోల్డెన్‌అవర్ అంటారు. సీపీఆర్ అనేది గుండెపోటు లేదా శ్వాస ఆగిపోయిన అత్యవసరస్థితిలో ప్రాణాలను రక్షించే ప్రాథమిక వైద్య ప్రక్రియ. గోల్డెన్ అవర్‌లో సీపీఆర్ తర్వాత బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించాలి. వైద్యులు సకాలంలో వైద్యం అందిస్తే సదరు వ్యక్తి మళ్లీ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే.. గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స ద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. సీపీఆర్‌పై ఎక్కువ మందికి అవగాహన లేని కారణంగా బాధితుల గోల్డెన్ అవర్ గడచిపోతున్నది.

ఫలితంగా సదరు వ్యక్తి ప్రాణాలు కోల్పోతున్నాడు. కాబట్టి.. సీపీఆర్‌పై అందరికీ అవగాహన అవసరం. సీపీఆర్ అవసరం ఒక్క కార్డియక్ అరెస్ట్‌కు మాత్రమే పరిమితం కాదు. కరెంట్ షాక్ తగిలి స్పృహ కోల్పోయి, శ్వాస ఆగిపోయిన పరిస్థితిలోనూ ఆ వ్యక్తికి సీపీఆర్ చేయవచ్చు. ముందుగా ఆ స్థితిలో ఉన్న వ్యక్తి శరీరంలో కదలికలు ఉన్నాయో లేదో చూడాలి. ఉచ్ఛాస, నిశ్వాసాలు ఉన్నాయో లేదో ఛాతి కదలికలను గమనించాలి. అవేమీ లేకుంటే.. వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేయాలి. ఈలోపు సీపీఆర్ చేయాలి. ముందుగా బాధితుడిని బల్లపరుపుగా ఉన్న నేలపై పడుకోబెట్టాలి.

ఛాతి మధ్యభాగంపై రెండు చేతులు ఉంచి నిమిషానికి సుమారు 100 సార్లు గట్టిగా కొడుతూ ఉండాలి. అలా చేసిన కొద్ది నిమిషాల్లోనే బాధితుడి గుండె మళ్లీ కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. తర్వాత అంబులెన్స్‌లో బాధితుడిని ఆసుపత్రికి తరలించాలి. సీపీఆర్‌పై అవగాహన కల్పించడంలో ప్రభుత్వ వ్యవస్థల పాత్ర కీలకం. పోలీస్ శాఖ, వైద్యారోగ్యశాఖ కలిసి ప్రతి పల్లె నుంచి పట్టణాలు, నగరాల వరకు విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.

పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో సెమినార్లు నిర్వహించాలి. నిపుణులైన వైద్యనిపుణులతో ప్రాక్టికల్‌గా సీపీఆర్‌పై శిక్షణ ఇవ్వాలి. ప్రజల మధ్య నుంచి కొందరిని పిలిచి వారితో సీపీఆర్ ప్రాక్టీస్ చేయించాలి. మీడియా, స్వచ్ఛంద సంస్థలు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు అందరూ కలిసి సీపీఆర్‌ను ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

 మలిపెద్ది కల్యాణ్, గుండాల