27-01-2026 12:00:00 AM
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తన మూర్ఖత్వపు చర్యతో టీ20 ప్రపంచకప్ నుంచి అవమానకరరీతిలో నిష్క్రమించాల్సి వచ్చింది. భారత్లో ప్రపంచకప్ ఆడితే తమ భద్రతకు ప్రమాదం పొంచి ఉందనే కారణం చూపిస్తూ మ్యాచ్ వేదికలను మార్చాలంటూ బీసీబీ మొండిపట్టు పట్టింది. కానీ బంగ్లాదేశ్ అభ్యర్థనను తోసిపుచ్చిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ).. జట్టు ఆటగాళ్లు, ఇతర సిబ్బందికి భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని, ఆ బాధ్యత తమదేనంటూ హామీ ఇచ్చింది.
మాట వినని బంగ్లాదేశ్ ఈ విషయంలో ఎంతవరకైనా వెళ్తామని మంకుపట్టు పట్టడం ఐసీసీకి ఆగ్రహం తెప్పించింది. ఫలితంగా ఈసారి టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ జట్టును తప్పిస్తూ, ర్యాంకింగ్స్‌లో తర్వాతి స్థానంలో ఉన్న స్కాట్లాండ్‌కు అవకాశమిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. టీ20 ప్రపంచకప్‌కు దూరమవ్వడం వల్ల బంగ్లా క్రికెట్ బోర్డుపై ఆర్థికపరమైన భారం పడనుంది. వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు ఇచ్చే 5 లక్షల డాలర్లతో పాటు ఐసీసీ నుంచి యేటా అందే 27 మిలియన్ డాలర్లు కోల్పోనుంది. వరల్డ్‌కప్‌కు దూరం కావడం బంగ్లా స్వయంకృతాపరాధమేనిని చెప్పొచ్చు.
కొంతకాలంగా బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుసగా దాడులు, హిందూ దేవాలయాల కూల్చివేతలు జరుగుతున్న సంగతి తెలిసిందే. త్వరలో బంగ్లాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి రాజకీయ శక్తులన్నీ భారత్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయి. పైగా జమాతే ఇస్లామీ, ఇస్లామిక్ రాడికల్ శక్తులు భారత్‌కు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగాలు చేస్తూ యువతను రెచ్చగొడుతున్నాయి.
ఈ జాఢ్యం బంగ్లా క్రికెట్ కూడా పాకింది. నిజానికి ఆటను రాజకీయంతో ముడిపెట్టడం సరికాదు. బీసీసీఐ ఆదేశాలతో ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు నుంచి విడుదల చేసిందన్న కోపంతో తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిషేధిస్తూ పనికిమాలిన నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. తమ భద్రతకు ప్రమాదం పొంచి ఉందన్న సాకు చూపిస్తూ భారత్‌లో మ్యాచ్‌లు ఆడలేమంటూ ఐసీసీకి తేల్చిచెప్పింది. ఒకప్పుడు తమ స్వాతంత్య్రానికి అడ్డుపడిన పాకిస్థాన్‌కే ఇప్పుడు బంగ్లా మద్దతు పలకడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించాలనే ప్రతిపాదనపై ఐసీసీ బోర్డు సమావేశంలో ఓటింగ్ నిర్వహించగా, 14 దేశాల ప్రతినిధులు అనుకూలంగా ఓటు వేశారు. పాక్ మాత్రమే బంగ్లాదేశ్‌కు మద్దతు పలికింది.
అంతటితో ఆగకుండా బంగ్లాకు మద్దతుగా టోర్నీలో భారత్‌తో మ్యాచ్ ఆడకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. 2008 ముంబయి ఉగ్రదాడుల తర్వాత టీమిండియా పాక్‌తో మ్యాచ్‌లు ఆడడం మానేసింది. దీంతో పాక్‌లో ఐసీసీ టోర్నీలన్నీ తరలిపోయి ఆదాయం లేకపోయింది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. అయితే.. బీసీబీ ఇక్కడ ఒక విషయాన్ని మరిచిపోయింది.
ప్రపంచ క్రికెట్ ఆదాయంలో 70 శాతానికి పైగా వాటా కలిగిన బీసీసీఐ అభీష్టానికి వ్యతిరేకంగా ఐసీసీ వ్యవహరించే పరిస్థితి లేదు. బీసీసీఐని కాదని బంగ్లా క్రికెట్ బోర్డు ముందుకెళ్లే పరిస్థితి ఎంతమాత్రం లేదు. అందుకే ఐసీసీ కూడా తమ నిర్ణయం పట్ల పునరాలోచించుకోవాలని బీసీబీకి విజ్ఞప్తి చేసింది. అయినా ఫలితం శూన్యం. ఏమైనా.. మున్ముందు బీసీబీ మూల్యం చెల్లించుకోక తప్పదనిపిస్తున్నది.