calender_icon.png 31 July, 2025 | 6:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాలపై అవగాహన

30-07-2025 11:23:54 PM

ఎస్సై ప్రశాంత్ రెడ్డి..

కోనరావుపేట (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని శివంగాలపల్లి గ్రామంలో సైబర్ నేరాలు మాదక ద్రవ్యాల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోనరావుపేట పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ కె. ప్రశాంత్ రెడ్డి(SI Prashanth Reddy) ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ప్రస్తుతం సమాజంలో సైబర్ నేరాలు మాదక ద్రవ్యాల వినియోగం అధికంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఈ విషయంలో చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ సైబర్ నేరాల పలు రకాలపై వివరించారు. ముఖ్యంగా ఫోన్ కాల్స్ ద్వారా బ్యాంకు అధికారులుగా నటిస్తూ వ్యక్తిగత సమాచారాన్ని పొందే మోసాలు, ఫేక్ లింకుల ద్వారా డేటా దొంగతనం, ఫిషింగ్ ఎస్ఎంఎస్ లు, సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్‌ల ద్వారా వేధింపులు, నకిలీ ఉద్యోగ అవకాశాల పేరుతో మోసాలు జరుగుతున్నట్లు తెలిపారు.

వాట్సాప్ గ్రూపుల ద్వారా పంపే నకిలీ అప్లికేషన్లను డౌన్‌లోడ్ చేయడం ద్వారా పర్సనల్ డేటా దొంగతనం చేయబడుతుందని ప్రజలకు వివరించారు.బ్యాంకులు ఎప్పటికీ ఓటీపీ, పాస్‌వర్డ్, ఎటిఎం పిన్ వంటి వివరాలు అడగవని, ఎవరైనా అడిగితే వాటిని చెప్పరాదని సూచించారు. గుర్తు తెలియని లింకులు ఓపెన్ చేయరాదని, అనుమానాస్పద వెబ్‌సైట్లను ఉపయోగించరాదని, సోషల్ మీడియా ఖాతాలలో ప్రైవసీ సెట్టింగ్‌లను బలంగా ఉంచాలని తెలిపారు. ఫేక్ లింకులు, ఫేక్ ఉద్యోగాలు, ఉచిత బహుమతుల పేరుతో వచ్చే మోసాలకు భలయ్యే విధంగా ఉండకూడదని, పిల్లల మొబైల్ వాడకంపై తల్లిదండ్రుల పర్యవేక్షణ వహించాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైన వారు వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని చెప్పారు. అవసరమైతే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాల్సిందిగా సూచించారు.క్రొత్తగా పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగంపై కూడా ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించబడింది.

గంజాయి, హషీష్, హెరాయిన్, బ్రౌన్ షుగర్ వంటి డ్రగ్స్ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని, యువత స్నేహితుల ఒత్తిడితో వీటికి బలవుతున్నారని అన్నారు. డ్రగ్స్ వినియోగం కేవలం నేరమే కాకుండా కుటుంబాన్ని, వ్యక్తి భవిష్యత్తును కూడా నాశనం చేస్తుందని హెచ్చరించారు. ఎన్డిపిఎస్ చట్టం ప్రకారం డ్రగ్స్ కలిగి ఉండటం, వాడటం, విక్రయించడం తీవ్ర నేరంగా పరిగణించబడుతుందని, దానికి పది నుంచి ఇరవై సంవత్సరాల వరకు జైలు శిక్షలు, భారీ జరిమానాలు విధించబడతాయని తెలిపారు.యువత డ్రగ్స్ వల్ల కలిగే మానసిక, శారీరక నష్టాలను తెలుసుకొని వాటిని దూరంగా ఉంచుకోవాలని సూచించారు. ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నారని లేదా అమ్ముతున్నారని గమనించిన వారు డయల్ 100 లేదా 1908 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబంది గ్రామస్తులు పాల్గొన్నారు.