24-10-2025 11:27:03 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శుక్రవారం కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కామారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి T. నాగరాణి మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీ, జంగంపల్లి గ్రామంలో న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పరిసర ప్రాంతాలు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తిT. నాగరాణి న్యాయ సేవల ప్రాధాన్యం, ఉచిత న్యాయ సహాయం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) చేపడుతున్న వివిధ న్యాయ సేవా కార్యక్రమాలు గురించి వివరించారు.
పిల్లల హక్కులు, పాక్సో చట్టం (POCSO Act), బాల్యవివాహ నిషేధ చట్టం, బాల కార్మిక నిషేధ చట్టం, మహిళా రక్షణ చట్టాలు గురించి విస్తృత అవగాహన కల్పించారు. ప్రతి బాలిక సురక్షిత వాతావరణంలో విద్యను కొనసాగించి ఎదగడం సమాజం యొక్క బాధ్యత అని పేర్కొన్నారు. శారీరక మరియు మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు యోగ, ధ్యానం, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం వంటి అలవాట్లు అలవరచుకోవాలని సూచించారు. విద్యార్థులు భవిష్యత్తుపై దృష్టి సారిస్తూ, “ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదివి, మంచి ప్రవర్తనతో, నైతిక విలువలతో ముందుకు సాగితేనే దేశ భవిష్యత్తు బలపడుతుందని అన్నారు.
విద్య అనేది జీవితాన్ని మార్చగల శక్తి అని పేర్కొన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్ణయించుకొని, కష్టపడి చదివి, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని సూచించారు. NALSA లీగల్ ఎయిడ్ హెల్ప్‌లైన్ కు ఏ సమస్య ఉన్నా 15100 కు కాల్ చేయవచ్చని అన్నారు. తదనంతరం పాఠశాల ప్రాంగణం, హాస్టల్ గదులు,వంట గది పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించి తగిన సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ శ్రీలత , వైస్ ప్రిన్సిపాల్ జెస్సికా , స్టాఫ్, విద్యార్థులు, DLSA సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.