calender_icon.png 25 October, 2025 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్నూలు బస్సు ప్రమాదం: కీలక విషయాలు గుర్తించిన ఫోరెన్సిక్ బృందాలు

25-10-2025 10:09:23 AM

హైదరాబాద్: కర్నూలు బస్సు ప్రమాదంలో(Kurnool bus accident) ఫోరెన్సిక్ బృందాలు కీలక విషయాలు గుర్తించాయి. బస్సు లగేజీ క్యాబిన్ లో 400కు పైగా మొబైల్స్ ఫోన్ల పార్సిల్ ఉన్నట్లు ఫోరెన్సిక్ టీమ్ గుర్తించింది. బస్సులో మంటలు చెలరేగడంతో ఫోన్లలోని బ్యాటరీలు పేలాయి. బ్యాటరీలు పేలడంతో మరింతగా మంటలు బస్సుకు వ్యాపించాయి. ప్రయాణికులు తప్పించుకునేందుకు వీలు లేకపోవడంతో భారీగా ప్రాణనష్టం సంభవించిందని ఫోరెన్సిక్ అధికారులు పేర్కొన్నారు.

కర్నూలు బస్సులో ప్రమాదంలో 19 మంది సజీవదహనం

కర్నూలు జిల్లాలో నిన్న జరిగిన ఘోర బస్సు అగ్నిప్రమాదంలో 19 మంది సజీవదహనం అయ్యారు. నిన్న కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద వేటూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు మంటలు అంటుకున్నాయి. మంటల్లో చిక్కుకుని 19 మంది ప్రాణాలు కోల్పోగా, 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో వేమూరి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం, డ్రైవర్ ముత్యాల లక్ష్మయ్యపై కర్నూలు పోలీసులు ఉలిందకొండ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. ప్రయాణీకుడు రమేష్ ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేయబడింది. బస్సు డ్రైవర్లు, బస్సు నడుపుతున్న ముత్యాల లక్ష్మయ్య, అతని సహోద్యోగి జి. శివ నారాయణలను అరెస్టు చేశారు. లక్ష్మయ్యపై సెక్షన్ 125/A, 106 C, ఇతర సంబంధిత నిబంధనల కింద కేసులు నమోదు చేయబడ్డాయి. 19 మంది ప్రయాణికుల మరణానికి ఆయన, బస్సు యాజమాన్యం బాధ్యులని ఆరోపించారు. 

కీలకం కానున్న డీఎన్ఏ రిపోర్ట్..

బస్సు ప్రమాదంలో మృతదేహాల గుర్తింపునకు డీఎన్ఏ కీలకం కానుంది. డీఎన్ఏ పరీక్షలు పూర్తి చేయడానికి ఫోరెన్సిక్ డైరెక్టర్ పాలరాజు నేతృత్వంలో బృందం ఏర్పాటు చేశారు. డీఎన్ఏ పరీక్షల రిపోర్టుకు 48 గంటలకుపైగా సమయం పట్టే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. 19 మృతదేహాల నుంచి సాఫ్ట్ టిష్యూ, ఎముక మూలుగ, ఇతర నమూనాలు సేకరించారు.