27 March, 2026 | 3:30 AM

అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్లో వరద నిర్వహణపై అవగాహన సదస్సు

27-03-2026 01:42 AM

కొత్తపల్లి, మార్చి 26(విజయక్రాంతి): కొత్తపల్లి పట్టణంలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో యువ ఆపదమిత్ర పథకం భాగంగా నిర్వహించిన వరద నిర్వహణ అవగాహన సదస్సులో అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి , ఎన్సీసీ 9వ తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ ఏ.కే. జయంత పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు విపత్తుల నిర్వహణపై అవగాహన కల్పించడం అత్యంత అవసరమని, దీనికి సమాజంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నదని పేర్కొన్నారు.

ఎన్సీసీ కేడెట్లకు ఈ అంశాలపై శిక్షణ ఇవ్వడం ద్వారా వారు సమాజానికి సేవ చేయగల సత్తా పెంపొందుతుందని తెలిపారు. తదుపరి లెఫ్టినెంట్ కర్నల్ ఏ.కే. జయంత  మాట్లాడుతూ విద్యార్థుల్లో విపత్తుల నిర్వహణపై అవగాహన పెంపొందించడానికి సమగ్ర ప్రణాళికలు రూపొందించి, వాటిని సమయానికి అమలు చేయడం అవసరమని అన్నారు. ఇలా చేయడం ద్వారా విద్యార్థులలో బాధ్యతా భావం మరియు సేవాస్ఫూర్తి మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.

యువ ఆపదమిత్ర పథకం ద్వారా కేడెట్లకు వివిధ విపత్తులపై విస్తృత అవగాహన కల్పించబడుతుందనీ, విపత్తుల నిర్వహణ చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని, అందులోని మార్గదర్శకాలను సక్రమంగా అమలు చేస్తే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాకుండా, వాటిని నివారించగలమని వివరించారు.ఈ శిబిరంలో భాగంగా లోయర్ మనెర్ డ్యామ్  వద్ద వరద పరిస్థితుల్లో చేపట్టాల్సిన రక్షణ చర్యలపై ప్రాయోగిక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వాటర్ రెస్క్యూ టెక్నిక్స్ మరియు పడవల నిర్వహణ (ఫ్లడ్ రిస్క్) పై జిల్లా అగ్నిమాపక అధికారి ఎం. శ్రీనివాస్ రెడ్డి గ, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రాజ్కుమార్ (కరీంనగర్), స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేందర్ (సిరిసిల్ల) మార్గదర్శకత్వంలో ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 9వ తెలంగాణ బెటాలియన్ ఎన్సీసీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ వి. కృష్ణ , ఎన్సీసీ అధికారులు మరియు కేడెట్లు పాల్గొన్నారు.