05-04-2025 05:04:09 PM
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్...
నారాయణపేట (విజయక్రాంతి): సమ సమాజ దార్శనికుడు బాబు జగ్జీవన్ రామ్ అని, ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని నారాయణ పేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్ లోని ప్రజావాణి హాల్ లో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో పాటు జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ముఖ్య అతిథిలుగా హాజరై జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... స్వాతంత్ర సమరమోధుడిగా, ఉప ప్రధానిగా, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సమ సమాజ దార్శనికుడిగా జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు మహోన్నతమైనవని కొనియాడారు.
చిన్ననాటి నుంచే వివక్షను ఎదుర్కొన్న ఆయన కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారని ఆమె చెప్పారు. దేశ స్వయంపాలనలో కేబినెట్ మంత్రిగా కార్మిక శాఖలో అనేక సంస్కరణలను తీసుకొచ్చారని కితాబునిచ్చారు. దేశ రక్షణ, వ్యవసాయం, టెలి కమ్యూనికేషన్స్ శాఖలకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని చెప్పారు. ఉప ప్రధానిగా దేశానికి ఎంతో సేవ చేశారని అన్నారు. జాతి కోసం వారు చేసిన సేవలకు దర్పణంగా నిలుస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాస పథకాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ.. అంటరానితనం, కులం పేరుతో కొనసాగుతున్న సామాజిక వివక్ష సంపూర్ణంగా సమసిపోయే దిశగా మనందరం పని చేసినప్పుడే బాబు జగ్జీవన్ రామ్ కు ఘనమైన నివాళి అర్పించిన వారమవుతామని ఆయన చెప్పారు.
దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ... బాబు జగ్జీవన్ రామ్ జీవిత చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఉమాపతి, డి.ఎస్.పి నల్లపు లింగయ్య, డిఆర్డిఏ మొగులప్ప, డీ పిఆర్ ఓ ఎం.ఏ రషీద్, ఎస్సీ కార్పొరేషన్ ఈ డి అబ్దుల్ ఖలీల్, ఏ ఓ జాన్ సుధాకర్, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ సైదులు, దళిత సంఘాల నాయకులు మహేష్, శరణప్ప, రమేష్, వెంకటేష్, సత్యనారాయణ, సూర్యకాంత్, గడ్డం కృష్ణయ్య, వసతి గృహాల వార్డెన్లు, కలెక్టరేట్ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.