18-05-2025 12:00:00 AM
ఒకసారి నావికులతో కలిసి ఓ కోతి కూడా సముద్రయానానికి వెళ్లింది. మార్గమధ్యంలో నావ మునిగి పోవడంతో అందరూ నీళ్లలో పడ్డారు. అంద రూ ఈదుకుంటూ వెళ్లిపోతున్నారు కానీ పాపం కోతికి ఈతరాక రక్షించమంటూ అరిచింది. దారినపోతున్న ఓ తిమింగలం చూసి దాన్ని తన వీపుపైకి ఎక్కించుకుంది. ‘అందరూ ఈదుకుంటూ వెళుతున్నారుగా.. ‘నీకు ఈతరాదా? అలా అరుస్తున్నావ్?’ అని అడిగింది.
అసలే అది బడాయి కోతి. అలా అడిగేసరికి ‘నాకెందుకు రాదు, ఎంచక్కా వచ్చు’ అని అబద్ధం చెప్పింది. ‘మరి ఈదుకుని వెళ్లొచ్చుగా’ అంది తిమింగలం. దానికి కోతి ‘నేను కోతుల రాజుని, మాకు సేవకుల చేత పనులు చేయించడం అలవాటు’ అని చెప్పింది. ఆ మాటలు విని తిమింగలానికి ఒళ్లు మండింది. ‘ప్రాణాపాయంలో ఉన్నప్పుడు కూడా రాజభోగాలు కావాలా నీకు? ఈతరాదని ఒప్పుకోవచ్చుగా, అంత బడాయి ఎందుకు?’ అని నిలదీసింది.
దానికి కోతి ‘నువ్విప్పుడు నాకు సాయం చేస్తున్నావు కాబట్టి శిక్షించకుండా వదిలేస్తున్నా, అదే అడవిలో అయితే నీ పని చెప్పేదాన్ని’ అంటూ తిమింగలానికి మరీ కోపం తెప్పించింది. ‘నీకే కాదు మాకూ శిక్షలు వేయడం వచ్చు’ అంటూ వీపు మీద ఉన్న కోతిని నీళ్లలో పడేసింది తిమింగలం. కోతి ‘నన్ను క్షమించి కాపాడు.. నాకు నిజంగానే ఈతరాదు. ఇంకెప్పుడు ఎవరినీ తక్కువ చేసి మాట్లాడను’ అని వేడుకుంది. తిమింగలం మనసు కరిగి కోతిని కాపాడింది.