calender_icon.png 11 February, 2026 | 7:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటర్లకు ఎర!

11-02-2026 02:20:36 AM

  1. గల్లీలవారీగా దావతులు 
  2. చివరి రోజు ఓటర్లకు అభ్యర్థుల గాలం
  3. డబ్బు, మద్యం, చీరలు, చికెన్ పంపిణీ

కామారెడ్డి/నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు గెలిచేందుకు చివరి అవకాశాన్ని కూడా జారవిడుచుకోవడం లేదు. ప్రచారం ముగియడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విందులు ఏర్పాటు చేశారు. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలైన బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు ఓటర్లకు ఎర వేశారు. తమ అనుచరుల ద్వారా ఓటర్లను కలిసి మద్యం, బిర్యాణి, ఒక్క ఓటుకు రూ.500 నుంచి రూ.5 వేల వరకు ఓటర్లకు పంచిపెట్టారు.

కామారెడ్డిలో కొన్ని వార్డుల్లో మహిళలకు వెండి కుంకుమ భరణిలు, పట్టుచీరలను పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ వార్డుల్లో కేవలం మద్యం బాటిళ్లతోనే సరిపెట్టారు. బీసీ, జనరల్ స్థానాల్లో అభ్యర్థులు ఒకరి కంటే ఒకరు పోటీపడి ఓటర్లకు పంపకాలు చేపట్టారు. కొన్ని వార్డులలో ఇంటికి కిలో చికెన్ అందజేశారు. ఎల్లారెడ్డిలో చీరలు పంపిణీ చేశారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లారే వరకు ఆయా వార్డులోని ప్రధాన పార్టీ లీడర్లు అభ్యర్థులు మందు బాటిళ్లను మోస్తూ కనిపించారు.

కులాల వారిగా గంపగుత్తగా ఓట్లను కొనుగోలు చేసేందుకు లక్షల్లో ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఉన్నత వర్గాలకు చెందిన అభ్యర్థులు నిలుచున్నచోట్ల పార్టీలను పక్కనపెట్టి ఆ వర్గాలకు చెందిన అన్ని పార్టీల ప్రధాన రెడ్డి నేతలంతా ఒక్కటై ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు వాదన వినిపిస్తోంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ లీడర్ బీజేపీకి ఓటు వేయాలని కోరుతూ ఓటర్లకు చేసిన ఆడియో కాల్ లీక్ కావడంతో తీవ్ర దుమారం రేగుతోంది.