బల్దియా బడ్జెట్ 11,460 కోట్లు!
విస్తరించిన నగరానికి భారీ ప్రణాళిక
సిద్ధమైన 2026 ముసాయిదా
గతేడాది కంటే రూ.450 కోట్లు అధికం
29న స్టాండింగ్ కమిటీ ముందుకు బడ్జెట్
వచ్చే నెలలో కౌన్సిల్ ఆమోదం
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 27 (విజయక్రాంతి): విశ్వనగరం నుంచి బృ హత్ నగరంగా అవతరించిన హైదరాబాద్ అభివృద్ధికి బల్దియా అధికారులు భారీ ఆర్థిక ప్రణాళికను రచించారు. చుట్టుపక్కల ఉన్న 27 పురపాలక సంఘాల విలీనంతో దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా రికార్డు సృష్టించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. ఆ స్థాయికి తగ్గట్టుగానే వచ్చే ఆర్థిక సంవత్సరం 2026 కోసం మెగా బడ్జెట్‌ను రూపొందించింది. ప్రజల అవసరాలు, మౌలిక వసతుల కల్పన, భారీ ప్రాజెక్టుల నిర్వహణను దృష్టిలో ఉంచుకుని సుమారు రూ.11,460 కోట్లతో బడ్జెట్ ముసాయిదాను సిద్ధం చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025 బడ్జెట్ రూ.11,010 కోట్లతో పోలిస్తే.. ఈసారి అదనంగా రూ.450 కోట్లను పెంచడం గమనార్హం. ఇటీవలే రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 27 పట్టణ స్థానిక సంస్థలు జీహెచ్‌ఎంసీలో విలీనమయ్యాయి. దీంతో నగర విస్తీర్ణం 2,053 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. కోర్ సిటీతో పోలిస్తే.. ఈ కొత్తగా విలీనమైన ప్రాంతాల్లో మౌలిక వసతుల కొరత ఉంది. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, పార్కులు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం అత్యవసరం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే బడ్జెట్ రూపకల్పన చేసినట్లు సమాచారం. విలీన ప్రాంతాల అభివృద్ధికి నిధుల కొరత లేకుండా చూసేందుకే బడ్జెట్ పరిమాణాన్ని పెంచినట్లు అధికారులు చెపుతున్నారు.
బడ్జెట్లో సింహభాగం.. అంటే సుమారు రూ.7,403 కోట్లను పెట్టుబడి వ్యయంగా కేటాయించాలని ప్రతిపాదించారు. ఎస్‌ఆర్డీపీ కింద ఫ్లైఓవర్ల నిర్మాణం, నాలాల అభివృద్ధి , రోడ్ల విస్తరణ వంటి శాశ్వత ప్రాజెక్టులకు ఈ నిధులను వెచ్చించనున్నారు. కేవలం ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులకే పరిమితం కాకుండా.. నగరాన్ని అంతర్జాతీయ స్థాయి లో తీర్చిదిద్దేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. విలీన ప్రాం తాల్లో పన్నుల వసూలు ప్రక్రియను విస్తృ తం చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
వ్యాపార అనుమతుల ద్వారా వచ్చే ఆదాయం కూడా కలిసొస్తుందని భావిస్తున్నారు. వీటన్నింటినీ పరిగ ణనలోకి తీసుకుని ఈసారి రెవెన్యూ ఆదాయాన్ని రూ. 6,441 కోట్లుగా అంచనా వేశారు. ఆదాయాన్ని పెంచుకుంటూనే.. అనవసర ఖర్చులకు కళ్లెం వేయాలని అధి కారులు నిర్ణయించారు. దీనికి తగినట్టుగానే రెవెన్యూ వ్యయాన్ని రూ. 4,057 కోట్లకు పరిమితం చేశారు. తద్వారా రూ. 2,384 కోట్ల రెవెన్యూ మిగులును చూపించడం విశేషం.
29న స్టాండింగ్ కమిటీ భేటీ
అధికారులు రూపొందించిన ఈ ముసాయిదా బడ్జెట్‌ను ఈ నెల 29న సోమవారం మేయర్ అధ్యక్షతన జరగనున్న స్టాండింగ్ కమిటీ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. స్టాండింగ్ కమిటీ సభ్యులు ఈ ప్రతిపాదనలను పరిశీలించి, అవసరమైన మార్పులు చేర్పులు సూచించనున్నారు. వారి ఆమోదం పొందిన తర్వాత ఫిబ్రవరిలో జరిగే జీహెచ్‌ఎంసీ స్పెషల్ కౌన్సిల్ సమావేశంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు.




