02-07-2025 10:41:44 PM
పాల్గొన్న సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జి డా. కోట నీలిమ..
సనత్ నగర్ (విజయక్రాంతి): బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం(Balkampet Yellamma Rathotsavam) బుధవారం సాయంత్రం నేత్రపర్వంగా సాగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Verma) సతీమణి సుధాదేవ్ వర్మ, కలెక్టర్ హరిచందనతో కలిసి సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి అమ్మవారి రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రథం ముందు డప్పు చప్పుళ్లు, కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రథోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం, రథోత్సవం ప్రశాంతంగా నిర్వహించడంపై డాక్టర్ కోట నీలిమ అధికారులకు అభినందనలు తెలిపారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి, ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లను చేసిన జీహెచ్‌ఎంసీ, విద్యుత్, దేవాదాయ శాఖ, పోలీస్, ట్రాఫిక్ పోలీస్, ఆర్అండ్‌బీ, వాటర్ వర్క్స్, సమాచార శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులను అభినందించారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, భక్తులకు సేవలు చేసిన వలంటీర్లను మెచ్చుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. అమ్మవారి ఆశీర్వాదం లేకుండా ఇదంతా సాధ్యం కాదన్నారు.