23-01-2026 12:54:56 PM
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) సిట్ కేటీఆర్ ను విచారిస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay Kumar) పేర్కొన్నారు. సిట్ విచారణ సీరియల్ లా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. సిట్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం స్వేచ్ఛ ఇవ్వండం లేదని తెలిపారు. కేటీఆర్ ను విచారణకు ఎందుకు పిలిచారు?, హరీశ్ రావు(Harish Rao) ఫోన్ ట్యాప్ అయ్యిందని పిలిచారా?, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ చేయించారని పిలిచారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్ల లావాదేవీలు జరిగాయని ఆరోపించారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారులనుంచి వందల కోట్లు తీసుకున్నారని పేర్కొన్నారు. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలోనే ట్యాపింగ్ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బండి సంజయ్ తెలిపారు. హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని చెప్పారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. మంత్రుల, జడ్జిల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని వెల్లడించారు. ప్రభాకర్ రావును అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం లేదన్నారు.
ఈ సిట్ విచారణను నమ్మమంటారా? ఏం సాధించారు? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోకుండా సాగదీస్తున్నారని మండిపడ్డారు. ట్యాపింగ్ భయంతో కేసీఆర్ కూతురు, అల్లుడు ఏడాది పాటు ఫోన్ వాడలేదన్నారు. కేసీఆర్ హయాంలో ఫోన్లు మాట్లాడాలంటే భయపడే పరిస్థితి ఉండేదన్నారు. ట్యాపింగ్ చేసిన వారినే పిలిచి మీరు చేశారా అని అడిగితే ఎలా? అని కేంద్రమంత్రి ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల కేసు విచారణ నిమిత్తం బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లోని ప్రత్యేక దర్యాప్తు బృందం (Special Investigation Team) ఎదుట హాజరయ్యారు.