24-12-2025 04:39:20 PM
నెల రోజుల్లో పంచాయతీలకు నిధులివ్వాల్సిందే
లేకుంటే హైదరాబాద్ నడిబొడ్డున స్థానిక ప్రజాప్రతినిధులతో పరేడ్ నిర్వహిస్తాం
కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ ఎంపీ పరిధిలో గెలిచిన బీజేపీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల అత్మీయ సన్మాన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ పాల్గొన్నారు. బీజేపీ మద్దతుతో గెలిచిన 108 మంది సర్పంచులను, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను సైతం ఘనంగా సన్మానించారు. రాబోెయే నెల రోజుల్లో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో రాష్ట్రంలోని సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో కలిసి హైదరాబాద్ లో పరేడ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. నిధులను మంజూరు చేసిన తరువాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ సాకుతో నిధుల విడుదలలో జాప్యం చేస్తే కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచేందుకు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని అల్టిమేటం ఇచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ సర్పంచులను గెలిపించిన గ్రామాలను అన్ని విధాలా అభివ్రుద్ది చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.