calender_icon.png 24 December, 2025 | 7:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం మత్తులో ఏఎన్ఎంపై చేయి చేసుకున్న సిహెచ్ఓ..!

24-12-2025 05:56:43 PM

మందు బాటిల్‌తో ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రంలో హల్చల్

భయభ్రాంతులకు గురైన వైద్య సిబ్బంది

చివ్వెంల,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని గుంపుల తిరుమలగిరి గ్రామంలోని ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (CHO) విధుల్లో ఉన్న మహిళా ఏఎన్ఎం (ANM)పై చేయి చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మద్యం సేవించిన స్థితిలో ఆరోగ్య కేంద్రానికి వచ్చిన CHO, చేతిలో మందు బాటిల్ పట్టుకొని సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించాడని సమాచారం. ఈ క్రమంలో మహిళా ఏఎన్ఎం పై దాడికి పాల్పడటంతో ఆమె తీవ్ర భయాందోళనకు గురై కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న స్థానికులు వెంటనే కేంద్రానికి చేరుకుని పరిస్థితిని గమనించారు. ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న అవాంఛనీయ ఘటనపై స్థానికులు CHO ను తీవ్రంగా నిలదీయగా, అతడిని సెంటర్ నుంచి బయటకు వెళ్లగొట్టినట్లు సమాచారం.

ఈ మొత్తం ఘటనను అక్కడే ఉన్న ఒక డాక్టర్ తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి, పై అధికారులకు సమాచారం అందించారు. మహిళా ఉద్యోగిపై మద్యం మత్తులో దాడి చేసిన CHO పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే సస్పెండ్ చేయాలని గ్రామస్తులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో మహిళా సిబ్బందికి పూర్తి స్థాయి భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. ఈ ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.